నరసాపురం: ఓటర్ల నమోదు కార్యక్రమంలో కూటమి నేతల కుట్రలను తిప్పికొట్టి, వైఎస్సార్‌సీపీ అభిమానులకు అన్యాయం జరగకుండా చూడాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు సూచించారు. శనివారం సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయంలో నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి బూత్ లెవెల్ ఏజెంట్లకు (బీఎల్‌ఏ) నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అభిమానుల ఓట్లను తొలగించేందుకు కూటమి నాయకులు భారీ కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. పార్టీ నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లు ఈ దశలో కీలకంగా పనిచేయాలని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ మాట్లాడుతూ ఈవీఎం మోసాలతో గత సార్వత్రిక ఎన్నికల్లో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో విస్తారంగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును దొంగదెబ్బ తీయాలని చూస్తోందన్నారు. అనేక దొంగ కారణాలతో వైఎస్సార్‌సీపీ అభిమానుల ఓట్లు గల్లంతు చేయాలని చూస్తోందని పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలో ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన చంద్రబాబు సర్కార్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో భంగపాటు తప్పదనే భయం పట్టుకుందని అన్నారు. ఓటరు నమోదు ప్రక్రియలో పార్టీ నియమించిన బీఎల్‌ఏల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పీడీ రాజు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, జడ్పీటీసీలు బొక్కా రాధాకృష్ణ, తిరుమాని బాబూజీ, జిల్లా ఉపాధ్యక్షుడు పప్పుల రామారావు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పాలా రాంబాబు, ట్రేడ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎండీ షానవాజ్‌ఖాన్, ఇంజేటి జాన్ కెనడీ, పట్టణ, మండల, మొగల్తూరు మండలాల అధ్యక్షులు కామన బుజ్జి, ఉంగరాల రమేష్, రేవు నారాయణరాజు, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ దొంగ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


