తాడేపల్లిగూడెం (టీఓసీ): తెలంగాణ నుంచి వచ్చిన మొక్కజొన్న లోడులను తాడేపల్లిగూడెం సీడబ్ల్యూసీ గోదాముల్లోకి అనుమతించడం లేదని శుక్రవారం ఉదయం లారీ డ్రైవర్లు నిరసనకు దిగారు. అన్‌లోడ్ చేయకపోవడంతో తాము ఆరు రోజులుగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం సమీపంలోని బోనకల్, వైరా, మధురా తదితర పరిసర ప్రాంతాల నుంచి 150కుపైగా లారీల్లో మొక్కజొన్న తీసుకుని గత శనివారం ఇక్కడికి వచ్చామన్నారు. అప్పటి నుంచి గిడ్డంగి అధికారులు అన్‌లోడ్ చేయడం లేదని వాపోయారు. ఖమ్మంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఆర్టీఏ అధికారులు బలవంతంగా తమతో మొక్కజొన్న లోడు చేయించారని, తాము అన్‌లోడ్ చేసుకుని తిరిగి వెళితేనే కాంట్రాక్టర్ ద్వారా కొంత కిరాయి వస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా రెండు రోజులుగా 40 లారీల్లో లోడు దిగుమతి చేసుకున్న ఇక్కడి గిడ్డంగి అధికారులు నాసిరకం మొక్కజొన్న అంటూ తిరస్కరిస్తున్నారన్నారు. తాము తిరిగి వెళ్లిపోవాలని అంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో మొక్కజొన్న నాణ్యతను పరిశీలించి, ప్రభుత్వపరంగా ఆన్‌లైన్ చేశారని ఇప్పుడు ఇక్కడ దించమంటే ఎలా అని ప్రశ్నించారు. ఆరు రోజులుగా తిండితిప్పలు లేకుండా ఇబ్బంది పడుతున్నామని, గాలివానలతో బిక్కుబిక్కుమంటూ లారీల వద్ద గడుపుతున్నామని వాపోయారు. మొక్కజొన్న దిగుమతి చేసుకుని తమను స్వస్థలాలకు పంపాలని కోరుతున్నారు. దీనిపై గోదాముల అధికారుల వివరణ కో రేందుకు ప్రయత్నించగా ఈ విషయమై మాట్లాడేందుకు వారు నిరాకరించారు. లోడ్ లారీలు హౌసింగ్ బోర్డు నుంచి రిలయన్స్ పెట్రోల్ బంకు వరకు ఇరువైపులా బారులు తీరాయి.


