పరిహారం అందలేదు
ఇప్పటికీ ఇవ్వలేదు
గత ప్రభుత్వంలో సాగుకు ముందే సాయం
సాక్షి, భీమవరం : 2026–27 వ్యవసాయ సీజన్‌కు గాను ఖరీఫ్ సాగుకు రైతులు అడుగులు వేస్తున్నారు. మూడు రోజుల్లో కాలువలకు నీరు విడుదల కానుండగా పొలాల్లో మెరక పల్లాలు సరిచేసుకోవడం, దుక్కు పనుల్లో నిమగ్నమవుతున్నారు. నారు నుంచి నాట్లు వరకు ఎకరాకు రూ.12 వేల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి. గత ఖరీఫ్ మోంథా పరిహారం రూ.23 కోట్లు కూటమి ప్రభుత్వం ఇప్పటికి విడుదల చేయక తొలకరి పెట్టుబడులు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 2.15 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరుగనుంది. ముందుగా మాసూళ్లు జరిగిన తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం, తణుకు ప్రాంతంలో తొలకరి పనులు కోసం రైతులు పొలాలను సిద్ధం చేస్తున్నారు. నవంబరు చివరిలో వచ్చే తుపానుల బారిన పడకుండా పనులు ముమ్మరం చేసి జూలై మూడో వారం నాటికి నాట్లు పూర్తి చేయాల్సి ఉంది.
అందని పరిహారం
గత ఖరీఫ్ చివరి దశలో మోంథా తుఫాను తీవ్ర నష్టం కలిగించింది. రోజుల తరబడి పొలాల్లోని ముంపునీరు బయటకు లాగక పొట్టలు కుళ్లిపోయి ఎంటీయూ 1318, పీఎల్‌ఏ 1100, తదితర రకాల్లో తాలు గింజల శాతం పెరిగింది. 4,207 హెక్టార్లలోని పంట నీట మునగ్గా, 6,560 హెక్టార్లలోని పంట నేల వాలినట్టు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలనలో జిల్లాలోని 9,201 (సుమారు 23,002 ఎకరాలు) హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్టు తేల్చారు. ప్రాథమిక అంచనా కంటే తుది నష్టం భారీగా తగ్గించేశారు. అత్యధికంగా నరసాపురంలో 2,722 మంది రైతులకు చెందిన 1,281 హెక్టార్లు, పెంటపాడులో 2,230 మంది రైతులకు చెందిన 1,078 హెక్టార్లలో నష్టం జరిగింది. తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, వీరవాసరం మండలాల్లో 500 హెక్టార్లకు పైబడి, ఆకివీడులో 464 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. హెక్టారుకు రూ.25 వేల చొప్పున రూ.23 కోట్ల సాయాన్ని కూటమి ప్రభుత్వం రైతులకు అందించాల్సి ఉంది. గత వ్యవసాయ సీజన్ ముగిసిపోయి మరలా కొత్త సీజన్ పనులు మొదలవుతుండగా ఇప్పటికి పరిహారం అందించకపోవడం గమనార్హం.
పెట్టుబడుల కోసం ఇక్కట్లు
సార్వాలో నారుమడులు సిద్ధం చేసిన నాటి నుంచి నాట్లు వేసే వరకు నెల రోజుల వ్యవధిలో నారుమడికి విత్తనాలు, పంట దమ్ము, పారలంకలు, నేలను చదునుచేసేందుకు, ఎరువులు, నాట్లు వేసేందుకు కూలీ ఖర్చులు తదితర రూపాల్లో రూ.12 వేల వరకు ఖర్చవుతుంది. ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సాయం అందించకపోవడంతో తొలకరి పెట్టుబడులు కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అన్నదాత సుఖీభవ సాయంలోను కూటమి ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. జిల్లాలో దాదాపు 80 వేల మంది కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం విడుదలపై ఊసెత్తడం లేదు. మరోపక్క గత ప్రభుత్వం అమలుచేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసి ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది. గత ప్రభుత్వం నిలిపివేసిన నీటి తీరువాను వడ్డీతో సహా రైతుల నుంచి వసూలు చేస్తోంది.
తొలకరిలో సాగు పెట్టుబడి (సుమారు)
విత్తనం ప్యాకెట్ రూ.600
నారుమడి నిమిత్తం ఐదు సెంట్ల స్థలంలో ఆకుమడి దమ్ము, విత్తనాలు చల్లేందుకు, ఎరువుకు రూ.1,000
నాట్లు నిమిత్తం పొలాన్ని రెండు సార్లు దమ్ము చేసేందుకు రూ.3,000
పట్టి తోలేందుకు రూ.500
గట్లు చెక్కేందుకు రెండు కూలీలు (కూలీ రూ.700 చొప్పున) రూ.1,400
నాట్లు వేసేందుకు కూలీలకు రూ.4,000
బస్తాన్నర యూరియా, ఒక డీఏపీ, 40 కేజీల పొటాష్‌లకు రూ.2,300, చల్లేందుకు కూలీ ఖర్చులు కూలీలు రూ.2,100
కలుపు మందులు రూ.500, పురుగుమందులు రూ.2,500, కూలీ ఖర్చులు రూ.2,100
పంట కోతకు రూ.5,200
రవాణా, ఆరబెట్టేందుకు రూ.2,000, కూలీలు రూ.2,100
అన్నదాత.. ఆక్రందన
మోంథా తుపానుతో గత ఖరీఫ్‌లో రూ.23 కోట్ల మేర పంట నష్టం
కొత్త వ్యవసాయ సీజన్ మొదలవుతున్నా ఇంకా పరిహారం అందించని కూటమి ప్రభుత్వం
సాయం కోసం రైతుల ఎదురుచూపులు
పంట నష్టపరిహారాన్ని అదే సీజన్‌లో అందిస్తూ వచ్చిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
జిల్లాలో 2.15 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌కు రైతులు సన్నద్ధం
ఆరుగాలం అప్పులు చేసి పండించిన పంట రైతు చేతికి అందకుండా మోంథా ముంచేసింది. పంట నష్టంతో దెబ్బ మీద దెబ్బ తగిలింది. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇప్పటివరకూ కూటమి ప్రభుత్వం రైతులకు నష్ట పరిహారం ఇవ్వలేదు. తొలకరి పెట్టుబడుల కో సం రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
– అడారి శ్రీనివాసరావు, రైతు, అత్తిలి
కూటమి ప్రభుత్వం ఇస్తానన్న మోంథా తుపాను నష్టపరిహారం ఇప్పటివరకూ అందలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏ సీజన్‌లో నష్టం వాటిల్లితే అప్పుడే నష్టపరిహారం ఇచ్చేవారు. మోంథా తుపానుతో పంట నష్టపోయి ఏడు నెలలు గడిచినా ఇప్పటికీ అందించలేదు. ప్రభుత్వం తక్షణం నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.
– దేవరశెట్టి రాంబాబు, రైతు, పెంటపాడు మండలం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు కోసం ఇబ్బంది పడాల్సిన పనిలేకుండా సాగు ప్రారంభానికి ముందే వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద ప్రభుత్వం రైతులకు సాయం అందిస్తూ వచ్చింది. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సాయం రూ.6 వేలకు, రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500లు జతచేసి ఏటా రూ.13,500లు మొత్తాన్ని ఖరీఫ్ ప్రారంభానికి ముందు, కోతలు, రబీ ఆరంభంలో మూడు విడతలుగా అందించేవారు. అధిక వర్షాలతో పంట నష్టం వాటిల్లితే అదే సీజన్‌లో పరిహారం అందించడం ద్వారా రైతులకు అండగా నిలిచారు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.


