విద్యుత్‌ కోతపై ఆక్వా రైతుల ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కోతపై ఆక్వా రైతుల ఆగ్రహం

May 29 2026 8:04 AM | Updated on May 29 2026 8:04 AM

విద్యుత్‌ కోతపై ఆక్వా రైతుల ఆగ్రహం

యలమంచిలి: భారీ వర్షం వలన విద్యుత్‌ అంతరాయం ఏర్పడి 36 గంటలు గడచినా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించకపోవడంతో చించినాడ జాతీయ రహదారిపై గురువారం ఆక్వా రైతులు, గ్రామస్తులు రాస్తారోకో చేశారు. సుమారు గంట పాటు రహదారిని దిగ్బంధించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రైతు నాయకుడు ముదు నూరి రంగరాజు మాట్లాడుతూ ఈదురుగాలులలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరగ్గా.. ఆక్వా రైతులంతా జనరేటర్‌ సహాయంతో చెరువులు కాపాడుకున్నామన్నారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించకపో వడంతో జనరేటర్స్‌ కాలిపోతున్నాయని, విద్యుత్‌ శాఖ అధికారులతో మాట్లాడదామంటే ఒక్కరూ ఫోన్‌ ఎత్తడం లేదన్నారు. రైతులంతా సబ్‌స్టేషన్‌ దగ్గరకు వెళితే కనీసం సమాచారం చెప్పడం లేదన్నారు. దీంతో తప్పనిసరై రోడ్డెక్కామన్నారు. చించినాడ ఆక్వా పరిధిలోని రైతులంతా నెలకు రూ.లక్షకు పైగా విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నామని, అధికారులు నిర్లక్ష్య వైఖరి తగదన్నారు. చించినాడ గ్రామంలోని ఆర్లపాడు, పెదపేట, అరుంధతీపేట, విప్పర్తివారిపేటలకు విద్యుత్‌ పునరుద్ధరించలేదని గ్రామస్తులు ఆరోపించారు. పాలకొల్లు రూరల్‌ సీఐ గుత్తుల శ్రీనివాస్‌ వచ్చి విద్యుత్‌ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. ఆక్వా రైతులు చిలువూరి విశ్వనాథరాజు, గుబ్బల శ్రీనివాస్‌, చిలువూరి సత్యనారాయణరాజు, పాతపాటి ఆంజనేయరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement