వడదెబ్బతో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వ్యక్తి మృతి

May 29 2026 8:04 AM | Updated on May 29 2026 8:04 AM

వడదెబ్బతో వ్యక్తి మృతి ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి నారసింహునికి అభిషేకాలు

నూజివీడు: వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన ఘటన నూజివీడు ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. మండలంలోని అన్నవరంనకు చెందిన మల్లవల్లి శివనాగరాజు (39) తన తల్లితో కలిసి పోలసానపల్లిలో నివసిస్తున్నాడు. ఇతను పట్టణంలోని ఓ స్వీట్‌ దుకాణంలో పనిచేస్తూ గత మూడు రోజులుగా ఇంటికి వెళ్లడం లేదు. గురువారం తెల్లవారుజామున నూజివీడు బస్టాండులో ఉన్న బెంచీపై శివనాగరాజు విగతజీవిగా పడి ఉన్నాడు. తెల్లవారుజామున 4.30 గంటలకు ఫస్ట్‌బస్‌కు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు చూసి విషయాన్ని బస్టాండులోని సిబ్బందికి తెలియజేశారు. అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా గమనించిన ఆర్టీసీ సిబ్బంది 108 కి సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షంచి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మూడు రోజులుగా ఇంటికి వెళ్లకుండా నూజివీడు బస్టాండ్‌లో రాత్రి పడుకున్న అతను వడదెబ్బకు గురై మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు.

పాలకొల్లు సెంట్రల్‌: సమాజంలో ఆచార వ్యవహారాలు పక్కన పెట్టి ప్రతి సీ్త్ర రుతుక్రమంలో పరిశుభ్రత పాటించాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి దేవ సుధ అన్నారు. గురువారం మండలంలోని లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ నవ్యజీవన్‌ ఆధ్వర్యంలో రుతు పరిశుభ్రత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుధ మాట్లాడుతూ పరిశుభ్రత పాటించకపోతే అనేక అనారోగ్య సమస్యలకు గురికావలసి ఉంటుందన్నారు. కౌమార దశలో ఉన్న బాలికలకు కళాశాలల్లో అవగాహన కల్పించడం ఈ అంశంపై సమాజంలో ఉన్న అపోహలను రూపుమాపడమే ప్రధాన ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో కిషోర్‌, దినేష్‌, గుడాల హరిబాబు, పి.ఎలిజిబెత్‌, ఎస్‌కే అమలేశ్వరరావు, సత్యవేణి, మంగ, మల్లేశ్వరి, ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పిలు, ఆశా కార్యకర్తలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.

ద్వారకాతిరుమల: శ్రీవారి దత్తత ఆలయమైన ఐఎస్‌ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో గురువారం విశేష కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతీ నక్షత్రాన్ని (స్వామివారి జన్మ నక్షత్రం) పురస్కరించుకుని ఆలయ యాగశాలలో వేద పండితులు విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, మండపారాధన చేశారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణల నడుమ సుదర్శన నారసింహ, ధన్వంతరీ, గరుడ, ఆంజనేయ, అనంత సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమాలు నిర్వహించారు. అర్చకులు, పండితులు గర్భాలయంలో కొలువైన స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలు చేసి, నక్షత్ర హారతులిచ్చారు. నీరాజన మంత్రపుష్పాలను సమర్పించారు. ఆఖరిలో భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందజేశారు. అన్నసమారాధనలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement