ఎదురింటి వ్యక్తే చంపేశాడు | - | Sakshi
Sakshi News home page

ఎదురింటి వ్యక్తే చంపేశాడు

May 29 2026 8:04 AM | Updated on May 29 2026 8:04 AM

వివాహిత మృతదేహం వెలికితీత

గత నెల 18న మిస్సింగ్‌ కేసు నమోదు

నూజివీడు: ఏలూరు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెదపాడు మండలం శౌరిపురంనకు చెందిన హత్యకు గురైన వివాహిత మల్లవల్లి విశాలి (30) మృతదేహాన్ని పోలీసులు గురువారం వెలికితీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాలి గత నెల 18వ తేదీన అదృశమైనట్లు ఫిర్యాదు రాగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో విశాలి తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఎదురింటి వ్యక్తే హత్య చేసి పూడ్చిపెట్డాడన్న అంశం విస్మయం కలిగించింది.

కాల్‌ డేటానే పట్టించింది

విశాలి ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉండే దిరిశినపు ఫ్రాన్సీస్‌ (35) అనే అతను వడ్డీకి డబ్బులు అప్పు ఇస్తూ ఉంటాడు. అతని దగ్గర డబ్బులు తీసుకున్న విశాలి డబ్బులు తిరిగి ఇవ్వమని పదేపదే ఒత్తిడి చేస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఫ్రాన్సీస్‌ విశాలినికి మాయమాటలు చెప్పి హనుమాన్‌ జంక్షన్‌ బస్టాండుకు రమ్మని తెలిపి అక్కడి నుంచి తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని నూజివీడు మండలం పల్లెర్లమూడి సమీపంలోని ఎన్నెస్పీ కాలువ పక్కనే ఉన్న చిట్టడవి లాంటి ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి హత్య చేసి వెళ్లిపోయాడు. ఆ తరువాత మూడు రోజులకు తిరిగి వచ్చి గొయ్యి తవ్వి అందులో మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. వివాహిత భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా మృతురాలి ఫోన్‌ నెంబరు కాల్‌డేటా పరిశీలించగా ఫ్రాన్సీస్‌ ఎక్కువసార్లు ఆమెతో మాట్లాడినట్లు తేలడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్యచేసి పాతిపెట్టిన విషయాన్ని తెలిపాడు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు నిందితుడిని తీసుకొని పాతిపెట్టిన ప్రాంతానికి తీసుకువచ్చి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టమ్‌ నిమిత్తం తరలించారు. దీనిపై తదుపరి విచారణ నిర్వహించిన అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. నూజివీడు డీఎస్పీలు శ్రావణ్‌కుమార్‌, కేవీవీఎన్‌వీ ప్రసాద్‌, మూడో పట్టణ, నూజివీడు రూరల్‌ సీఐలు వెంకటేశ్వరరావు, ఐవీ నాగేంద్రకుమార్‌, రూరల్‌ ఎస్సై జ్యోతీబసు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement