అతివేగం.. భయానకం | - | Sakshi
Sakshi News home page

అతివేగం.. భయానకం

May 29 2026 8:04 AM | Updated on May 29 2026 8:04 AM

ఇష్టారాజ్యంగా వెళుతున్న మట్టి ట్రాక్టర్లు

నిత్యం ప్రమాదాలపై ఆందోళన

నూజివీడు: వేగంగా వెళుతున్న మట్టి ట్రాక్టర్లు గ్రామస్తులను బెంబేలెత్తిస్తున్నాయి. ఎక్కువ ట్రిప్పులు వేయాలనే ఆతృతతో డ్రైవర్లు మట్టి ట్రాక్టర్లను ఇష్టానుసారంగా నడుపుతుండడంతో నిత్యం పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంతేగాకుండా లైసెన్స్‌ లేని మైనర్‌ పిల్లలు సైతం ట్రాక్టర్లు నడుపుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. మీర్జాపురంలోని వెంకన్న చెరువు నుంచి మట్టి తోలకాలు జరుగుతున్నాయి. మట్టి తోలకాలు ఎక్కువ ట్రిప్పులు వేయాలనే ఆతృతతో ట్రాక్టర్ల డ్రైవర్లు గ్రామంలోని వీధుల్లో సైతం ట్రాక్టర్లను అతివేగంగా నడుపుతున్నారు. కొందరు ట్రాక్టర్‌ యజమానులైతే వారి ట్రాక్టర్లను మైనర్లకు, లైసెన్స్‌ లేని వారికి అప్పజెప్పి వారితో తోలకాలు తోలిస్తున్నారు. ట్రాక్టర్ల అతివేగానికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి గ్రామంలో నెలకొంది. మీర్జాపురంలోని ప్రధాన రహదారిపై గురువారం హనుమాన్‌ జంక్షన్‌ వైపు వెళుతున్న కంటైనర్‌ను అతివేగంతో వెళ్తున్న మట్టి ట్రాక్టర్‌ కంటైనర్‌ వెనుక భాగంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌ ట్రక్కు బోల్తాపడింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోతే మైనర్లు, లైసెన్స్‌ లేని వారి చేతుల్లో ట్రాక్టర్లు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన చెబుతోంది. రోడ్డు భద్రత వారోత్సవాలు, అవగాహన కార్యక్రమాలు అంటూ పోలీసులు, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా వేగంగా వెళుతున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement