సంచుల కొరత.. తేమ శాతం పేరిట కోత
● రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్లు
● 7.7లక్షల టన్నుల సేకరణకు సన్నాహాలు
● జిల్లాలో ఏర్పాటుకానున్న 260 కేంద్రాలు
● గత రబీ చివరిలో కొనుగోలు కష్టాలు
సాక్షి, భీమవరం: జిల్లాలో రబీ ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. అంచనా దిగుబడి, సేకరణ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లా అంతటా 260 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయనుండగా మొదటి కేంద్రాన్ని సోమవారం అప్పారావుపేటలో ప్రారంభించనున్నారు. గత రబీ అనుభవాల దృష్ట్యా ఈసారైనా ధాన్యం సేకరణ సవ్యంగా జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
2.31 లక్షల ఎకరాల్లో..
జిల్లాలో 2.31 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరుగుతోంది. 80 శాతం విస్తీర్ణంలో ఎంటీయూ 1121 సాగు చేయగా, 15 శాతం విస్తీర్ణంలో పీఆర్ 126, మిగిలిన మేర ఇతర వంగడాలను రైతులు సాగు చేశారు. ముందుగా నాట్లు వేసిన తాడేపల్లిగూడెం రూరల్‌లో కోతలు మొదలయ్యాయి. తర్వాత భీమవరం, తణుకు, ఉండి, ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లోని అధిక శాతం విస్తీర్ణంలో వరిపంట చిరుపొట్ట దశ నుంచి పూత దశల్లో ఉంది. జిల్లా అంతటా మరో రెండు వారాల్లో వరికోతలు మొదలవుతాయని రైతులు అంటున్నారు. కోతలు మొదలు కావడంతో సోమవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని అప్పారావుపేట తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు ప్రారంభించనున్నారు. మరో వారం రోజుల్లో భీమవరంలోనూ ప్రారంభం కానుంది.
7.7 లక్షల టన్నుల సేకరణ : దాళ్వాలో ఎకరాకు 75 కిలోల చొప్పున 55 నుంచి 60 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా. ఈ మేరకు 9.5 లక్షల టన్నుల దిగుబడి రానుంది. ఈ మేరకు 7.7 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. వరి కామన్ వైరెటీ క్వింటాల్‌కు రూ.2,369, ఏ గ్రేడ్ రకాలకు రూ.2,389లకు కొనుగోలు చేయనున్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన 48 గంటల్లోపు చెల్లింపులు చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
గత సీజన్‌లో నిరసనలు
గత రబీలో పలు లోపాలతో రైతులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. మిల్లింగ్ సామర్థ్యాన్ని బట్టి ప్రభుత్వం మిల్లులకు లెవీ లక్ష్యాలను నిర్ణయించింది. టార్గెట్ పూర్తయిన మిల్లులు ధాన్యం సేకరణ చేయక కొందరు రైతులు దళారులను ఆశ్రయించి అయినకాడికి అమ్ముకోవడం, మరికొందరు ఇబ్బందులు పడు తూ దూర ప్రాంతాల్లోని మిల్లులకు తరలించుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. జిల్లాలో 2.2 లక్షల ఎకరాల్లో దాళ్వా సాగు చేయగా 9.25 లక్షల టన్నుల దిగుబడికి కేవలం 6 లక్షల టన్నులు మా త్రమే సేకరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. రైతుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో తర్వాత 7.5 లక్షల టన్నులకు లక్ష్యాన్ని పెంచింది.
సీజన్ ప్రారంభంలో సంచులకు కొరత లేనట్టు కనిపించినా మాసూళ్లు ముమ్మరమైనప్పుడు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో లోపాలు బయటపడుతున్నాయి. గడిచిన దాళ్వాలో ఆచంట, పాలకొల్లు, తణుకు నియోజకవర్గాల్లోని పలుచోట్ల గోనె సంచుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సంచులు అందక ఆరిన ధాన్యాన్ని వారం రోజులపైనే రోడ్లు పక్కన, కళ్లాల్లోనే ఉంచేసిన వారు ఎందరో ఉన్నారు. అదే సమయంలో ప్రతికూల వాతావరణంతో పంటను కాపాడుకునేందుకు అగచాట్లు పడాల్సి వచ్చింది. కొందరు మిల్లర్లు సంచులను రైతులకు కాకుండా దళారులకు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల్లో ధ్రువీకరించిన తేమ శాతం మేరకు మిల్లర్లు కొనుగోలు చేయాలని అధికారులు చెబుతుండగా, అందుకు మిల్లర్లు అంగీకరించడం లేదని రైతులు అంటున్నారు. తేమ శాతం పేరిట కోత పెడుతున్నారని, వే బ్రిడ్జిల వద్ద మోసాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.


