భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్లను నూరు శాతం త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో మత్స్య, డ్వామా, పంచాయతీరాజ్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. భీమవరం, కాళ్ల, మొగల్తూరు, నర సాపురం, ఆకువీడు మండలాల్లో రిజిస్ట్రేషన్ల ప్రగతి తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వీఏఎస్‌లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు 76,540 ఎకరాల విస్తీర్ణంలో రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా, మిగిలిన 29,018 రిజిస్ట్రేషన్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. మడ అడవులు ఉన్న దర్భరేపు, బియ్యపు తిప్ప, వేములదీవి ప్రాంతాల్లో ఆక్వా చెరువుల తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వవద్దని ఆదేశించారు.
రేపటి నుంచి ‘నీటి భద్రత’ : రాష్ట్రవ్యాప్తంగా నీటి భద్రత–సాగు నీటి సంఘాల బాధ్యత పేరుతో 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని సోమవారం నుంచి ప్రారంభించనున్నట్టు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లాలో సంబంధిత శాఖల అధికారులు ఆదివారం సీఎం నిర్వహించే టెలీ కాన్ఫరెన్స్‌లో భాగస్వామ్యం కావాలని సూచించారు.


