ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక నరసింహరావు పేటలో ఉన్న శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు రాకుండానే ద్వితీయ సంవత్సరం తరగతులు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఏఐఎస్‌ఎఫ్ నాయకులు బుధవారం కళాశాలకు వెళ్లి విద్యార్థులను బయటకు పంపించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కిన కళాశాల యజమాన్యంపై చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఉండి: రొయ్యల సాగులో మెరుగైన యాజమాన్య పద్ధతులపై మండలంలోని ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రంలో ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేవీకే హెడ్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు పత్రికా ప్రకటనలో బుధవారం తెలిపారు. జాతీయ మత్స్య అబివృద్ధి మండలి హైదరాబాద్ సహకారంతో నిర్వహిస్తున్న శిక్షణలో రొయ్యల పెంపకంలో యాజమాన్య పద్ధతులు, చెరువు తయారీ, పిల్ల ఎంపిక, మేత, వ్యాధులు, నూతన యాజమాన్య పద్ధతులు గురించి వివరిస్తారన్నారు. సమాచారం కోసం కేవీకే మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావును సంప్రదించాలన్నారు.


