నరసాపురం రూరల్: సీతారామపురంలోని స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) వేదికగా బుధవారం ‘విజన్–ఎక్స్ 2026’ పేరుతో రెండు రోజుల జాతీయ స్థాయి హ్యాకథాన్ వైభవంగా ప్రారంభమైంది. ఆక్వా టెక్ ఫౌండేషన్ సహకారంతో కళాశాలలోని కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 36 గంటల పాటు జరిగే నాన్‌స్టాప్ ఇన్నోవేషన్ చాలెంజ్‌లో రాష్ట్రం నుంచి 54 బృందాలు, ఇతర రాష్ట్రాల నుంచి 12 బృందాలు మొత్తంగా 122 టీమ్‌లు పాల్గొంటున్నాయి. తొలుత కళాశాల చైర్మన్ కొండవీటి వెంకట సత్యనారాయణ, కోశాధికారి కొండవీటి వెంకటేశ్వర స్వామి (త్రినాథ్), డైరెక్టర్ అడ్డాల శ్రీహరి జ్యోతి ప్రజల్వనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి, సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కనుగొనడమే హ్యాకథాన్ ముఖ్య ఉద్దేశమన్నారు. విద్యార్థులు అగ్రిటెక్, హెల్త్‌టెక్, ఫిన్‌టెక్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో వినూత్న ప్రొటోటైప్‌లు తయారుచేస్తున్నారు. డైరెక్టర్ ఎస్.కీర్తి కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.సురేష్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.గోపిచంద్, సీఎస్‌ఈ విభాగాధిపతులు డాక్టర్ పి.శ్రీనివాసులు, డాక్టర్ బి.మధు కుమార్, సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి డాక్టర్ టి.మురళీమోహన్ పర్యవేక్షించారు. గురువారం ముగింపు వేడుకల్లో విజేతలకు బహుమతులు అందిస్తామన్నారు.


