● క్షీరారామంలో ట్రస్ట్ ఏర్పాటు
● భక్తుల నుంచి విరాళాల సేకరణ
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి రథానికి బంగారు పూత పూయిస్తామని కొందరు భక్తులు ట్రస్టుగా ఏర్పడి రిజిస్ట్రేషన్ చేయించుకుని రంగంలోకి దిగారు. రథానికి రాగి తాపడం చేయించి దానిపై బంగారం పూత పూయిస్తామని ఆలయ ఈఓకు తెలియజేశారు. ఇందుకు ఈఓ అనుమతి ఇచ్చారా అంటే అధికారికంగా లేదనే చెప్పాలి. అయితే అనధికారికంగా మాత్రం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. దీంతో ట్రస్టు సభ్యులు రంగంలోకి దిగారు. పట్టణంలోని పలువురిని కలిసి విరాళాలు సేకరిస్తున్నారు. అయితే దీనిని కొందరు భక్తులు, అధికార పార్టీ సభ్యులు, పాలకమండలి సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. స్వామి పేరు చెప్పి నగదు ఎలా వసూలు చేస్తారని, గోల్డ్ కోటింగ్‌కు సంబంధించి ఖర్చుల లెక్కలు చూపిస్తారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంత బంగారం వినియోగిస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఆలయ ఈఓ ఏమన్నారంటే..
అభివృద్ధి పనులకు సంబంధించి ఆలయం నుంచి అనుమతులు రావాలంటే చాలా సమయం పడు తుందని ఈఓ అన్నారు. ఐదారుగురు వ్యక్తులు ట్రస్టు ఏర్పాటుచేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని దాని ప్రకారం చేస్తున్నారని, రథానికి బంగారం కోటింగ్ పూర్తి చేశాకా ఆలయానికి స్వాధీనం చేస్తారని చెప్పారు. అనధికారికంగా స్వామివారి పేరున వసూళ్లు చేస్తే చర్యలు తీ సుకుంటామని, విరాళాలకు రశీదులు ఇవ్వాలని అన్నారు. పూర్తి వివరాలు చెప్పాల్సిన బాధ్యత ట్రస్టు కు ఉంటుందని, దేవస్థానం పేరున చేస్తున్నారు కా బట్టి తాము అడుగుతామని చెప్పారు. రథం పనులు పూర్తయిన తర్వాత జమాఖర్చులు చెబుతామని ట్రస్టు సభ్యులు అన్నారని, అనుమానాలు ఉంటే ప్రశ్నించే హక్కు తమకు ఉందన్నారు. ఎవరికి వారే రిజిస్ట్రేషన్ చేయించుకుని వసూళ్లు చేస్తే ఏంచేస్తారు అని ఈఓను ప్రశ్నించగా.. ఎవరు వచ్చి వాళ్లు వసూళ్లు చేసి వ్యాపారం చేస్తానంటే ఎలా ఒప్పుకుంటామని ఈఓ ముగించారు.


