ఎన్‌హెచ్ 165 విస్తరణకు మోక్షమెప్పుడో..!
● ఏళ్ల తరబడి సాగుతున్న పనులు
● ఆకివీడు–దిగమర్రు మార్గంలో మొదలు కాని వైనం
● డీపీఆర్ మార్పుతో సరిపెట్టిన ప్రభుత్వం
ఆకివీడు: జాతీయ రహదారి 165 విస్తరణ పనులకు మోక్షమెప్పుడో అని జిల్లావాసులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. 2019లో అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆకివీడులో పనులకు శంకుస్థాపన చేశారు. అయితే రహదారి విస్తరణపై కొందరు కోర్టుకు వెళ్లడంతో పనులు నిలిచాయి. ఆ తర్వాత డీపీఆర్ మార్చి ఆకివీడులోని ఉప్పుటేరు వద్ద నుంచి అయిభీమవరం మీదుగా ఆకివీడు, కలిసిపూడి, పెదపుల్లేరు, సీసలి, జక్కరం, పెదమిరం, చిన అమిరం, రాయలం, గునుపూడి, తాడేరు, విస్సా కోడేరు శివారు వంకాయలపాలెం, పెన్నాడు శివా రు పెన్నాడుపాలెం, శృంగవృక్షం, వీరవాసరం కలిసేలా కొత్త మార్గానికి అనుమతి ఇచ్చారు. నిర్మాణం కోసం గతంలో రూ.1,400 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం అడ్డదారులు, అష్టవంకర్లుగా వెళుతున్న నాలుగు లైన్ల రోడ్డుకు రూ.3,200 కోట్లు కేటాయించారు. ఆకివీడు ప్రాంతంలో భూసేకరణ పనులు పూర్తయ్యాయి. అయితే ఉప్పుటేరు వద్ద నుంచి పనులు ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు.
ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేలా..
జాతీయ రహదారిలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్ర త్యామ్నాయంగా బైపాస్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. అయితే జాతీయస్థాయిలో డీపీఆర్ రెండోసారి మార్చడం విమర్శలకు తావిచ్చింది. కొందరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ డీపీఆర్ రూపొందించారనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారి అంటే ప్ర యాణం సాఫీగా సాగాలని, అయితే ఈ డీపీఆర్ ప్ర కారం మార్గం అలా లేదనే విమర్శలు ఉన్నాయి. పాలకొల్లు–పామర్రు రోడ్డుగా ఉన్న సమయంలోనే నాలుగు లైన్లకు సరిపడా రోడ్డుకు స్థలం ఉంది. పట్టణాల మధ్యలో కిలోమీటరు మేర డబుల్ లైన్‌గా ఉంది. అయినా నాలుగైన్ల బైపాస్ కోసం రూ.3,200 కోట్లు కేటాయించడంలో ఆంతర్యమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఎప్పటికీ పూర్తయ్యేనో..
జాతీయ రహదారి బైపాస్ రోడ్లుతో కలిపి నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం ఎప్పటికి పూర్తయ్యేనో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్లు కేటాయించినా ఈ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవం ఎండమావిగానే ఉందని, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పనులు వేగిరపర్చాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
ఉప్పుటేరుపై తుప్పుపట్టిన వంతెన నిర్మాణాలు
ఆకివీడులో నిలిచిన పనులు
ఎన్‌హెచ్ 165 విస్తరణకు మోక్షమెప్పుడో..!


