33 సబ్సిడీ సిలిండర్లు స్వాధీనం
తణుకు అర్బన్: గృహావసరాలకు వినియోగించాల్సిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌లో అక్రమంగా విక్రయాలు జరుపుతున్న నివాసంపై విజిలెన్స్ అధికారులు దాడి చేసి రూ.83,232 విలువైన 33 గృహ అవసరాలకు సంబంధించిన సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ కె.నాగేశ్వరరావుకు వచ్చిన సమాచారం మేరకు తణుకులోని పైడిపర్రు రాజీవ్ గాంధీనగర్ ప్రాంతంలోని గవర వెంకటేశ్వరరావు నివాసంలోను, ఆటోలోను ఉన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లుగా విజిలెన్స్ ఎస్సై కె.సీతారాము తెలిపారు. గ్యాస్ వినియోగదారుల కార్డుల ద్వారా గ్యాస్ బుక్ చేసి వాటిని అధిక లాభానికి హోటళ్లు, ఇతర వ్యాపారాలకు విక్రయిస్తున్నట్లుగా తేలిందని చెప్పారు. సిలిండర్లను సీజ్ చేసి సదరు గవర వెంకటేశ్వరరావుపై నిత్యావసరాల చట్టం 1955 ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తనిఖీల్లో తణుకు డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


