విశాఖ ఉక్కును కాపాడుకోవాలి
భీమవరం: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరణ చేసేవిధంగా అడుగులు వేస్తోందని, ఎందరో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలుగు జాతి హక్కు విశాఖ ఉక్కును మనమంతా కాపాడుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరామ్ అన్నారు. మంగళవారం భీమవరంలో బి వాసుదేవరావు అధ్యక్షతన జరిగిన సీపీఎం విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా సెయిల్‌లో విలీనం చేస్తే రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. మెడికల్ కళాశాలల నిర్మాణం, నిర్వహణ ప్రభుత్వమే చేపట్టాలని, పీపీపీ పద్ధతిని వెంటనే రద్దుచేయాలని బలరామ్ డిమాండ్ చేశారు. రైతుల పంటలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. డెల్టా ఆధునికీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని, ఇళ్లు, ఇళ్ళస్థలాల సమస్యని, శ్మశానవాటికల సమస్యను తక్షణం పరిష్కరించాలన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు మంతెన సీతారామ్ మాట్లాడుతూ లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి జేఏవీ గోపాలన్, జిల్లా సెక్రేరియట్ సభ్యులు కౌరు పెద్దిరాజు, కర్రా నాగేశ్వరరావు, పీవీ ప్రతాప్, పార్టీ జిల్లా సీనియర్ నాయకులు జుత్తిగ నర్సింహమూర్తి, కె రాజారామ్మోహన్‌రాయ్ తదితరులు పాల్గొన్నారు.


