ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయాలి
ఏలూరు (టూటౌన్): కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని మరింత పటిష్ట పరచాలని, చట్టాన్ని చట్టంగానే కొనసాగించాలని, పథకంగా మార్పు చేయరాదని, సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఇప్పుడు పూజ్య బాపుజీ గ్రామీణ రోజ్ గారి యోజన పథకంగా పేరు మార్చి పేదలు, వ్యవసాయ కార్మికుల పొట్ట కొట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కేవలం పేరు మాత్రమే మారుస్తున్నారని అనుకుంటే పొరపాటేనని, చట్టంగా ఉన్న దానిని కేవలం పథకంగా మార్పు చేయడం వల్ల భవిష్యత్తులో ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నీరు గారే ప్రమాదం ఉందన్నారు. ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వం రూ.2,50,000 కోట్ల కేటాయింపులు చేయాల్సి ఉండగా కేవలం రూ.60,000 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. సంవత్సరానికి 100 రోజులు పనులు చూపించాల్సి ఉండగా ఏలూరు జిల్లాలో కేవలం 38 నుంచి 50 రోజుల మధ్య మాత్రమే పనులు చూపించారని తెలిపారు. భవిష్యత్తులో ఉపాధి హామీలో కూడా కొలతలను గంటల పద్ధతితో ముడివేసి పని భారాన్ని పెంచే ప్రమాదం ఉందన్నారు.
కామవరపుకోట: మండలంలోని గుంటుపల్లి పంచాయతీకి చెందిన ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నేత కొమ్మిన నరేష్(46) సోమవారం ఉదయం చెరువులో పడి మృతి చెందారు. గుంటుపల్లి పక్కనే ఉన్న చెరువులో చేపలకు మేత వేసేందుకు వెళ్లిన నరేష్ ప్రమాదవశాత్తు తెప్ప తిరగబడడంతో మృతిచెందారు. అందరితోనూ కలివిడిగా ఉండే నరేష్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. పంచాయతీలో కీలక నాయకుడిగా ఉండడంతో పాటు జిల్లా స్థాయిలో పార్టీ పరంగా యాక్టివ్‌గా ఉంటున్నాడు. పోస్టుమార్టం అనంతరం నరేష్ మృతదేహాన్ని కొల్లివారిగూడెంలోని స్వగృహానికి తరలించారు. నరేష్ మృతదేహానికి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కీసరి సరితా విజయ్ భాస్కర్‌రెడ్డి, దెందులూరు మండల అధ్యక్షుడు, శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నానితో పాటు పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు నివాళులు అర్పించారు.
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విజయవాడ నుంచి జంగారెడ్డిగూడెం మీదుగా వేలేరుపాడు మృతదేహంతో వెళ్తున్న కేఆర్‌పురం ఐటీడీఏ అంబులెన్స్ ఎదురుగా మోటార్‌సైకిల్‌పై వస్తున్న చింతలపాటి శంకర్ వాహనాన్ని ఢీకొంది. దీంతో శంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే జంగారెడ్డిగూడెం ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్రాఫిక్‌ను అదుపు చేశారు. మృతిచెందిన శంకర్‌కు భార్య కరుణకుమారి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాభర్తలు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. తాడువాయి నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కామవరపుకోట: జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన విద్యార్థిని ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు గవర్రాజు తెలిపారు. పాఠశాలకు చెందిన విద్యార్థిని బోల్లిబోయిన శ్రావణి ఇటీవల వీరవాసరంలో జరిగిన అండర్–17 విభాగం సాఫ్ట్‌బాల్ పోటీలో విశేష ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. శ్రావణిని, శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయురాలు, శ్యామలాదేవిని పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు.
ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయాలి
ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయాలి
ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయాలి


