నత్తాలోవ డ్రైన్ వెంటనే తవ్వాలి
నరసాపురం రూరల్: నరసాపురం మండలంలోని సరిపల్లి, లిఖితపూడి, రుస్తుంబాద గ్రామాల్లోని పంటపొలాల్లో నీరులాగే ప్రధాన కాలువ నత్తాలోవ డ్రైన్ వెంటనే తవ్వాలని సోమవారం రైతులు, కౌలు రైతులు సరిపల్లి వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ నత్తాలోవ డ్రైన్ ఏళ్లుగా తవ్వడం లేదన్నారు. ఈ డ్రెయిన్‌పై మూడు గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంట సాగవుతుందని ఏళ్ళ తరబడి కాలువ తవ్వకపోవడంతో ప్రతి సార్వా పంటకు పంట వేయకుండా నిరుపయోగంగా వదిలేసి తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వరద సమయంలో పోటు నీరు పొలాల్లోకి వెళ్లి తిరిగి బయటకు లాగక పోవడంతో ప్రస్తుతం కనీసం దాళ్వా సాగు చేపట్టే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారన్నారు. ప్రభుత్వం, నీటిసంఘాల కమిటీలు పట్టించుకోకపోవడంతో ఇప్పటికే పంటలు కోల్పోయి కష్టాల్లో ఉన్న రైతులు సొంతంగా చందాలు వేసుకుని కాలువ తవ్వుకునే దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం, నీటి సంఘాలున్నా నిధులు కేటాయించి తవ్వకపోవడం దారుణమన్నారు. సమస్యపై డ్రైనేజీ డీఈ మోహన్ కృష్ణ, నీటి సంఘం డైరెక్టర్ అందే రామకృష్ణతో మాట్లాడగా వెంటనే వర్క్ అంచనా వేసి తీర్మానం చేసి త్వరలోనే కాలువను తవ్వుతామని హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో రైతులు మండా రమేష్, గన్నాబత్తుల ఏడుకొండలు, గన్నాబత్తుల నాగేశ్వరరావు, గమిడి మధుబాబు, కొక్కిరిమెట్టి వెంకటేష్, రాంబాబు, యర్రంశెట్టి సత్యనారాయణ, కేదాసు వీరన్న తదితరులు పాల్గొన్నారు.


