పాపికొండలకు రోడ్డు మార్గం
బుట్టాయగూడెం: పాపికొండల విహార యాత్రకు గతంలో పట్టిసీమ, పోలవరం, సింగన్నపల్లి, వాడపల్లి గ్రామాల సమీపంలో లాంచీల బోటు పాయింట్లు ఉండేవి. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులు ఈ గ్రామాల నుంచే బోటులో పాపికొండల విహార యాత్రకు వెళ్లేవారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు చేపట్టడంతో పై గ్రామాలలో ఉన్న బోటు పాయింట్లను తీసివేసి దేవిపట్నం మండలం గండి పోచమ్మతల్లి గుడి సమీపం నుంచి విహార యాత్రకు బోటు పాయింటు ఏర్పాటు చేశారు. పాపికొండల విహార యాత్రకు వెళ్లాలంటే రాజమండ్రి మీదగా గండిపోచమ్మ తల్లి గుడికి చేరుకుని అక్కడ నుంచి గోదావరి నదిపై లాంచీలు, బోటుపై ప్రయాణం చేస్తూ పాపికొండల అందాలను చూసే అవకాశం ప్రస్తుతం ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆ అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తుంది. పాపికొండల విహారయాత్రకు వచ్చే పర్యాటకులు బోటుపాయింటు దూర భారంగా ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఏలూరు జిల్లాలో పశ్చిమ ఏజెన్సీ అటవీ ప్రాంతం మీదగా పాపికొండలు సమీపంలోని కొరుటూరు వరకూ సుమారు 83 ఏళ్ల క్రితం బ్రిటీష్ కాలంలో రాళ్లను పేర్చి నిర్మించిన దాసన్ రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కృషి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. ఈ మార్గం అభివృద్ధి చేస్తే అడవి అందాలను ఆస్వాదిస్తూ పాపికొండల సందర్శనకు వెళ్లొచ్చు.
పాపికొండల సందర్శనకు ఇలా..
బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెం నుంచి ముంజులూరు మీదుగా చింతపల్లి వరకూ సుమారు 6.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు ఉంది. ఈ రోడ్డు పాడైపోయింది. గడ్డపల్లి నుంచి రాళ్లు పరిచిన దారి ఉంటుంది. ఇదే మార్గం ధారవాడ, కొరుటూరు వరకు వెళ్తుంది. గడ్డపల్లి దాటిన తర్వాత కొట్రుపల్లి మీదుగా చిలకలూరు, రావిగూడెం బంగ్లా రహదారి మీదుగా కొరుటూరు వరకూ సుమారు 15.49 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ మార్గాన్ని 3.5 మీటర్ల వెడల్పున నిర్మించాలని ప్రతిపాదన ఉంది. ఈ దాసన్ రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేస్తే అన్ని రకాల వాహనాలతో ప్రయాణం చేస్తూ అడవి అందాలు ఆస్వాదిస్తూ నేరుగా కొరుటూరు చేరుకుని అక్కడ పాపికొండలను చూడొచ్చు.
బ్రిటిష్ కాలంలో నిర్మించిన రోడ్డు మార్గం
బ్రిటిష్ కాలంలో దాసన్ అనే ఇంజనీరు ఈ రహదారిని నిర్మించారు. గడ్డపల్లి దాటిన తర్వాత కొట్రుపల్లి మీదగా కొరుటూరు వరకూ సమారు 15.49 కిలోమీటర్ల మేర రాళ్లను పేర్చి 1936–37 సంవత్సరంలో ఈ రహదారిని నిర్మించారు. ఎత్తయిన కొండలపై నుంచి 13 మలుపులతో ఉండే ఈ మార్గం మీదుగా ప్రయాణం ఎంతో మధురానుభూతి కలిగిస్తుంది. ఈ మలుపులు తిరుమల కొండపై ప్రయాణాన్ని తలపిస్తాయి. ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకంగానే కాకుండా అటవీ ప్రాతంలో జీవనం సాగిస్తున్న గిరిపుత్రులకు జీవనోపాధి మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. ఈ మార్గంలో జలతారు వాగు కనువిందు చేస్తుంది. రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రతి ఒక్కరూ జలపాతాన్ని చూసే అవకాశం ఉంటుంది.
వైఎస్సార్‌సీపీ పాలనలో రూ.10 కోట్లతో ప్రతిపాదన
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ప్రాజెక్టు నుంచి కొరుటూరు వరకూ ఉండే రోడ్డు మార్గం పూర్తిగా నిలిచిపోయింది. రోడ్డు మార్గంలో ఉన్న 19 గ్రామాల్లోని ప్రజలకు బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో పునరావాస గ్రామాలు ఏర్పాటు చేసి వారిని అక్కడకు తరలించారు. కొరుటూరు, పాపికొండలు చేరుకోవడానికి ప్రస్తుతం దాసన్ రోడ్డు ఒక్కటే మార్గం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు పర్యాటకంగా అటు అటవీ ప్రాతంలో జీవిస్తున్న గిరిజనులు జీవనోపాధి మెరుగుపర్చేలా వైఎస్సార్‌సీసీ పాలనలో నాటి కలెక్టర్ రేవు ముత్యాలరావు ఆధ్వర్యంలో ఐటీడీఏ, అటవీశాఖ, పోలవరం ప్రాజెక్టు పోలీసు అధికారులతో పాటు అప్పటి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దాసన్ రోడ్డు మార్గాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే వెనుకబడి ఉన్న గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని గిరిపుత్రులకు జీవనోపాధి కూడా లభిస్తుందని భావించి సుమారు రూ.10 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
బ్రిటీష్ కాలంలోనే కొండపై దాసన్ రోడ్డు
ఈ రోడ్డు అభివృద్ధికి గతంలో రూ.10 కోట్లతో ప్రతిపాదనలు
నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలంటున్న స్థానికులు
పాపికొండలకు రోడ్డు మార్గం
పాపికొండలకు రోడ్డు మార్గం
పాపికొండలకు రోడ్డు మార్గం


