ముగిసిన స్కూలుగేమ్ పోటీలు
వీరవాసరం: వీరవాసరం ఎమ్మార్కే జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ఆవరణలో ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగిన 69వ రాష్ట్ర స్థాయి స్కూలు గేమ్స్ సాఫ్ట్‌బాల్ అండర్–17 బాలబాలికల పోటీలు దిగ్విజయంగా ముగిశాయి. ఈ సందర్భంగా ముగింపు పురస్కరించుకొని గేమ్ కార్యదర్శులు మల్లేశ్వరరావు, దాసరి సునీత మాట్లాడుతూ అండర్ 17 బాలికల పోటీలో విజయనగరం జిల్లా ప్రథమ, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించినట్లు తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు గుద్దటి స్వామీజి, పరిశీలకుడు బండారు ప్రసాద్, కార్యదర్శి కె.జయరాజు, ఎంవీ కుద్దూస్, హెచ్‌ఎం జుత్తిగ శ్రీనివాస్, టోర్నమెంట్ ఆర్గనైజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 10,798 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 34 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. 10798 పెండింగ్ కేసులు, 238 ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ చేశామని, పెండింగ్ కేసులలో 10,351 క్రిమినల్ కేసులు, 153 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, 294 సివిల్ కేసులను రాజీ చేశామన్నారు. ఏలూరులో 1,988, భీమవరంలో 974, చింతలపూడిలో 1,248 జంగారెడ్డిగూడెంలో 971, కొవ్వూరులో 1,092, నర్సాపురంలో 434, పాలకొల్లులో 458, తాడేపల్లిగూడెంలో 1,433, తణుకులో 1,082, నిడదవోలులో 919, భీమడోలు 153 పెండింగ్ కేసులను పరిష్కరించామని తెలిపారు. కేసుల పరిష్కారానికి తోడ్పడిన న్యాయవాదులకు, పోలీస్ అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి, బీమా, బ్యాంకు అధికారులు, ఇతర విభాగాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
కొయ్యలగూడెం: అచ్యుతాపురం గ్రామ సరిహద్దులలో నిర్వహిస్తున్న డీజిల్ అక్రమ విక్రయాలలో ఓ రెవెన్యూ అధికారి పాత్ర ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. డిసెంబర్ మూడున సాక్షిలో ప్రచురితమైన డీజిల్ అక్రమ విక్రయాలపై అధికారులు దృష్టి పెట్టి విచారణ చేశారు. గోపాలపురం మండలంలోని రెవెన్యూ అధికారి ఒకరు విచారణకు వెళ్లిన అధికారులను పక్కదోవ పట్టిస్తున్నట్లు తెలిసింది. ఏలూరు జిల్లాకు చెందిన అధికారులు వెళ్లినప్పుడు పరిధి తూర్పుగోదావరి జిల్లాలోకి వస్తుందని, తూర్పుగోదావరి అధికారులు వెళ్ళినప్పుడు పరిధి మనది కాదు ఏలూరు జిల్లా పరిధిలోనిదని తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి కారణాలతోనే సుమారు రెండు సంవత్సరాల నుంచి అక్రమ డీజిల్ విక్రయదారులపై ఏ విధమైన కేసులు నమోదు కాలేదని తెలుస్తోంది.
భీమవరం: ఏపీ రిటైర్డ్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఎంఈయూ) నూతన కార్యవర్గం భీమవరంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. రాష్ట్ర అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా రేవూరి గోగురాజు(భీమవరం), ప్రధాన కార్యదర్శిగా డీవీఎస్‌ఎన్ మూర్తిమురళి(కాకినాడ), ఉపాధ్యక్షులుగా సీహెచ్ హరిబాబు(గుంటూరు), ఎంవీ నారాయణరెడ్డి(రాజమండ్రి), డి.మునుస్వామి(అనంతపురం), పీవీటీ రమణరావు(విశాఖపట్నం), కోశాధికారిగా జి.వేణుగోపాలస్వామి(తుని), ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె.సత్యనారాయణ (కాకినాడ), జె.శ్యామ్‌రాజ్(అనంతపురం), రీజినల్ సెక్రటరీలుగా ఎంవీ రామారావు(రాజమండ్రి), బి.వెంకటరామయ్య ఎన్నికయ్యారు.
ద్వారకాతిరుమల: స్థానిక విర్డ్ ఆస్పత్రిలో ఈనెల 11 నుంచి 14 వరకు అమెరికా, ఇండియాకు చెందిన వైద్యుల బృందం నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో 56 మంది రోగులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు ఆస్పత్రి ట్రస్ట్ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ఆదివారం తెలిపారు. అందులో భుజం, మోచేయి, తుంటి సమస్యలతో బాదపడుతున్న 20 మంది రోగులకు ఉచితంగా, అత్యాధునిక పద్ధతిలో విజయవంతంగా శస్త్ర చికిత్సలు చేసినట్టు చెప్పారు. ఇవి తమ వైద్య సాఫల్యానికి ఉదాహరణగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా వైద్యుల బృందాన్ని చైర్మన్ అభినందించారు. ఈ శిబిరంలో వైద్యులు శ్రీనాధ్ కామినేని (యూఎస్‌ఎ), భవ్య చాంద్, కృష్ణ కిరణ్, శ్రీనివాస్ కంభంపాటి (ఇండియా), విర్డ్ ఆస్పత్రి ట్రస్ట్ సభ్యులు వి.నారాయణ మూర్తి, ఎస్‌వీఎన్‌ఎన్ నివృతరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి, వైద్యులు హమీద్, బాలాజీ, పీవీ నాగేంద్ర బాబు, సింధు, రమ్య, మహిత తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన స్కూలుగేమ్ పోటీలు


