కాపులకు మంచి చేసింది జగనే
తణుకు అర్బన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో కాపు సామాజిక వర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారని, ఎన్నో సంక్షేమ పథకాల్లో కాపు వర్గాలకు లబ్ధి చేకూర్చారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తణుకు సీఎం ఫంక్షన్ హాలులో ఆదివారం నిర్వహించిన కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్‌పీఎస్) ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యాదవ కులస్థుడైన నన్ను రెండు పర్యాయాలు తణుకులో ఎమ్మెల్యేగా గెలవడంలో కాపులంతా సహకరించారని, అదే కాపుల ప్రోత్సాహంతోనే మంత్రిగా పదవి దక్కిందని అన్నారు. కాపులపై ఉన్న గౌరవంతోనే కాపు నేత వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని తణుకులో ఏర్పాటుచేయగలిగానని అన్నారు. వంగవీటి రంగా విప్లవాత్మక మార్పు కోసం ఉద్యమిస్తే ఆ ఉద్యమం కొనసాగితే రాష్ట్రంలో తమ పెత్తనం, దోపిడీ అంతమవుతుందనే ఆయనను హత్య చేశారని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) అధినేత బోడె రామచంద్రయాదవ్ అన్నారు. సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీల మాదిరిగానే కాపు సామాజిక వర్గం కూడా దశాబ్ధాలుగా వివక్షకు, అణచివేతకు గురవుతుందని అన్నారు. భవిష్యత్తులో బీసీలు, కాపులు, దళితులు ఏకంకావాల్సిన చారిత్రాత్మక సమయం ఆసన్నమైందని అన్నారు. కేఆర్‌పీఎస్ రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు, కాపు నాడు జాతీయ అధ్యక్షుడు గల్లా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
మాజీ మంత్రి కారుమూరి


