రేపటి నుంచే వందే భారత్ పరుగులు
● మధ్యాహ్నం 1.30కు ప్రారంభం
● నరసాపురం–చైన్నె మధ్య రాకపోకలు
నరసాపురం: చైన్నె నుంచి విజయవాడ వరకూ నడుస్తున్న ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రేపటి నుంచి జిల్లాలో పరుగులు పెట్టనుంది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు నరసాపురం రైల్వేస్టేషన్‌లో ఈ రైలును కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ ప్రారంభించనున్నారు. విజయవాడ రైల్వే డివిజన్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతున్నారు. నరసాపురం–చైన్నె మధ్య ఈ రైలు ప్రతి రోజు రాకపోకలు సాగించనుంది. 20678 నెంబరుతో రైలు నరసాపురంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి రాత్రి 12.45 గంటలకు చైన్నె చేరుకుంటుంది. 20677 నెంబరుతో చైన్నెలో ఉదయం 5.35 గంటలకు చైన్నెలో బయలుదేరి మధ్యాహ్నం 2.10 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. నరసాపురం, భీమవరం టౌన్, గుడివాడ స్టేషన్‌లో మాత్రమే ఆగుతుంది. పశ్చిమ డెల్టా వాసులు ఎంతోకాలంగా ఈ రైలు కోసం ఎదురు చూస్తున్నారు.


