దండగలా మారిన వ్యవసాయం
రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు
80 శాతం కౌలు రైతులు
● ఓ వైపు ప్రకృతి నష్టం.. మరోపక్క దిగుబడి శూన్యం
● తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతు
● మోంథా నష్టపరిహారం ఎప్పుడో?
తణుకు అర్బన్: వ్యవసాయం పండుగలా జరిగిన రోజుల నుంచి వ్యవసాయం దండగ మాదిరిగా మారిన నేటి రోజుల్లో అన్నంపెట్టే రైతాంగం అతలాకుతలమైపోయింది. ప్రకృతి వైపరీత్యాలు, దిగుబడి తగ్గడం వంటి కారణాలతో రైతు పరిస్థితి దీనంగా మారింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో వచ్చిన మోంథా తుపాను తాకిడికి పంట నీట మునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. స్వర్ణరకం పూర్తిగా నేలకొరగగా, 1318 రకం మాత్రం నిలబడి ఉన్నా గింజ నూకతోపాటు పలు సమస్యలు తలెత్తి నష్టపోయామని రైతులు చెబుతున్నారు. అన్నం పెట్టే రైతు కష్టంలో ఉన్నప్పుడు కనీసం పరామర్శలకు కూడా ప్రజాప్రతినిధులు వెళ్లకపోగా వ్యవసాయ శాఖ అధికారులు సైతం పంట నష్టాన్ని సరిగ్గా నమోదు చేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో పంట నష్టపోయామని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. తణుకు నియోజకవర్గంలోని తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు సంబంధించి 39,876 ఎకరాల్లో రైతులు వరిసాగు చేయగా సుమారుగా 3,321 ఎకరాల్లో పంట నష్టం నమోదు చేసినట్లుగా వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
మోంథా నష్టపరిహారం ఏదీ?
మోంథా తుపాను నష్టాన్ని వ్యవసాయ అధికారులు ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం అంటూ అరకొరగా నమోదుచేశారని పంట దిగుబడి పూర్తిస్థాయిలో రాలేదని ఆరోపిస్తున్నారు. నష్టం పూర్తిగా నమోదు చేయమంటే శాటిలైట్ అదీ ఇదంటూ కారణాలు చెప్పారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నష్టం నమోదుచేసిన దానికి కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని, వ్యవసాయాధికారులను అడిగినా పట్టించుకోవడంలేదని రైతులు చెబుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ఏ పంట నష్టం ఆ పంట సమయంలోనే రైతుకు అందేదని, బీమా చెల్లించకుండానే నష్టపరిహారం బ్యాంకు ఖాతాల్లో జమయ్యే పరిస్థితి ఉండేదని నేడు రైతును పట్టించుకునే నాధుడే లేడని వాపోతున్నారు.
ఖరీఫ్ సీజన్‌లో వచ్చిన మోంథా తుపాను తాకిడికి రైతు పూర్తిగా నష్టపోయాడు. చేలు నేరకొరిగిపోయి తడిచిపోవడంతో దిగుబడి తగ్గిపోయి రైతు నష్టాల ఊబిలో కూరుకుపోయాడు. ముఖ్యంగా కౌలు రైతుకు గింజ కూడా మిగలని దుస్థితి నెలకొంది. ఎకరాకు రూ. 30 వేలు పెట్టుబడి పెట్టి 25 బస్తాలు దిగుబడి వచ్చిన పరిస్థితిలో మగతాకు ఏమివ్వాలి, కౌలు రైతుకు ఏం మిగలాలి. తడిచిన ధాన్యం నష్టంగా నమోదుచేయమంటే వ్యవసాయశాఖ అధికారులు చొరవ చూపలేదు. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పెట్టుబడిగా ముందే అందించడంతోపాటు ఏ పంట నష్టం ఆ పంట సమయంలోనే అందించి రైతును ఆదుకున్నారు.
– ఆడారి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ
రైతు విభాగం అత్తిలి మండల అధ్యక్షుడు
వ్యవసాయరంగంలో వ్యవసాయం చేసేది అధికశాతం కౌలు రైతులే కావడంతో ఈ మోంథా తుపాను దెబ్బకి భారీగా నష్టపోయామని కౌలు రైతులు చెబుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో పంట దిగుబడి తగ్గడంతోపాటు ధాన్యం తడిచిపోయి చివరి గింజ వరకు చేతికి అందకపోగా రైతుకు మగతా ఇచ్చేయగా చేతికి ధాన్యం గింజ రాలేదని వాపోతున్నారు. అన్నదాతా సుఖీభవా పథకం కౌలు రైతుకు కూడా అందిస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయలేదని కౌలు రైతులు ఆరోపిస్తున్నారు. గత ప్రభ్వుతంలో ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టం వెంటనే అందేవని నేడు రైతుకు ఎటువంటి ప్రోత్సాహ ం లేకుండా పోయిందని రైతులు ఆరోపిస్తున్నారు.
దండగలా మారిన వ్యవసాయం


