మెటీరియల్ నాణ్యత పరిశీలన
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వినియోగించే మెటీరియల్ నాణ్యత పరిశీలన కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది. సీఎస్‌ఎంఆర్‌ఎస్ (సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్) శాస్త్రవేత్తల బృందం హరేంద్ర ప్రకాష్, ఉదయ్‌భాను చక్రబోర్తి, సిద్దార్ద్ పి.హెడవూలు శనివారం ప్రాజెక్టులోని మట్టి, రాతి నాణ్యత పరీక్షలను నిర్వహించారు. గ్యాప్–1, –2 ప్రాంతాలు, ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యాంలో వినియోగించే మట్టి, రాతి నాణ్యత ప్రమాదాలను వారు పరిశీలన చేశారు. అలాగే నిర్మాణ ప్రాంతంలోని నీటి ఇంకుడు స్వభావాన్ని, మట్టి సాంద్రత పరీక్షలు చేశారు. అదేవిధంగా ఆయా మెటీరియల్స్ శాంపిల్స్‌ను సేకరించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల బృందం మాట్లాడుతూ ప్రాజెక్టు ప్రాంతంలో నిర్వహించిన పరీక్షలతో పాటు, మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున శాంపిల్స్ సేకరించిట్లు చెప్పారు. ఇదే విషయాన్ని వారు ఇంజనీరింగ్ చీఫ్ ఎన్.నరసింహమూర్తికి తెలియజేశామన్నారు. కాగా, శాస్త్రవేత్తల బృందం ఆదివారం ఢిల్లీ వెళ్లనుంది. తమ పర్యటనలో భాగంగా నిర్వహించిన పరీక్షల వివరాల నివేదికను జలవనరుల శాఖకు నివేదించనుంది. ఈ కార్యక్రమంలో ఈఈలు డి.శ్రీనివాస్, బాలకృష్ణ, మేఘా ఇంజనీరింగ్ జనరల్ మేనేజర్ ఎ.గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి, మేనేజర్లు వెంకటేష్, గణపతి తదితరులు పాల్గొన్నారు.
భీమడోలు, పొలసానిపల్లి గ్రామాల్లో దొంగతనాలు
భీమడోలు: భీమడోలు, పొలసానిపల్లి గ్రామాల్లో తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున మూడు ఇళ్లలో చొరబడి 9 కాసులకు పైగా బంగారు అభరణాలు, రూ.2 లక్షల నగదును అపహరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పొలసానిపల్లిలోని జీవీ హోమ్స్‌లోని గంజి సుబ్బారావు కుటుంబ సభ్యులు తన ఇంటికి తాళాలు వేసి విజయవాడలోని కుమారుడి ఇంటికి వెళ్లారు. అలాగే పక్క ఇంటిలోని పాస్టర్ వాసే యోషయా క్రైస్తవ సభలకు వెళ్లారు. ఈ రెండు ఇళ్లలోకి చొరబడిన దొంగలు లాకర్స్‌ను సైతం పగల కొట్టారు. గంజి సుబ్బారావు ఇంటిలోని 9 కాసుల బంగారు అభరణాలు, రూ.50వేల నగదు దొంగిలించగా, పాస్టర్ వాసే యోషయా ఇంటిలో బంగారు చెవిదిద్దులు, జత పట్టీలను అపహరించారు. ఇదే తరహాలో భీమడోలు గొలుసు గేటులోని తవ్వా రత్న ప్రభాకరావుకు చెందిన బంధువులు తమ ఇంటికి తాళాలు వేసి అమెరికా వెళ్లారు. అదును చూసిన దొంగలు ఆ ఇంట్లోకి ప్రవేశించి లాకర్‌ను ధ్వంసం చేసి రూ.1.5 లక్షల నగదుతో పరారయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై ఎస్‌కే మదీనా బాషా ఘటనా స్థలాలను పరిశీలించారు. క్లూస్ టీంలు తనిఖీ చేశాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై ఎస్‌కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మెటీరియల్ నాణ్యత పరిశీలన


