రాజీ మార్గం.. రాజమార్గం
ఏలూరు (టూటౌన్): రాజీ మార్గమే.. రాజ మార్గమని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి అన్నారు. శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కేసుల పరిష్కారం కోసం 34 బెంచీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నెల రోజుల నుంచి నిర్వహిస్తున్న ఫ్రీ లోక్ అదాలత్ సిటింగ్స్, మధ్యవర్తిత్వం వల్ల 5 కేసుల్లో 50 లక్షల పైబడి వాహన ప్రమాద బీమా కేసుల్లో పరిహారంగా కక్షిదారులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అత్యధికంగా రూ.73 లక్షలను చోళ జనరల్ ఇన్సూరెనన్స్ కంపెనీకి సంబంధించి రాజీచేయడం జరిగిందని తెలియజేశారు. కావున కక్షిదారులు సత్వర పరిష్కారం కోసం లోక్‌అదాలత్‌ను వినియోగించుకోవాలన్నారు. జాతీయ లోక్ అదాలత్ నందు 10361 పెండింగ్ కేసులు 165 ప్రీలీటిగేషన్ కేసులను రాజీ చేసినట్లుగా డీఎల్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలియజేశారు. వీటిలో 147 వాహన ప్రమాద బీమా కేసులను రాజీ చేసి సుమారుగా రూ.14 కోట్ల వరకు పరిహారంగా కక్షిదారులకు అందించినట్లు చెప్పారు. ఇంకా కొన్ని కోర్టులలో కేసుల పరిష్కారం జరుగుతూ ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. న్యాయమూర్తులు, లోక్ అదాలత్ సభ్యులు న్యాయవాదులు పాల్గొన్నారు.
987 కేసుల రాజీ
భీమవరం: మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షుడు, 3వ అదనపు జిల్లా జడ్జిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి.లక్ష్మీనారాయణ అధ్యక్షతన శనివారం భీమవరం అన్ని కోర్టుల ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. 42 సివిల్, 931 క్రిమినల్, 14 బ్యాంకు, బీఎస్‌ఎన్‌ఎల్ మొండిబాకీ కేసులు మొత్తం 987 కేసులు పరిష్కరించారు. రాజీ మొత్తం విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం నిమిత్తం నాలుగు బెంచ్‌లు ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులుగా ఎం.సుధారాణి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి.సురేష్ బాబు, 1వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.హనీషా వ్యవహరించారు. బెంచ్ కోర్టు మేజిస్ట్రేట్ నాగరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి యోహాన్ (న్యూటన్), బార్ అసోసియేషన్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.
జాతీయ లోక్‌అదాలత్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి


