పోలవరంలో సీఎస్‌ఎంఆర్‌ఎస్ బృందం పర్యటన
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో సీఎస్‌ఎంఆర్‌ఎస్ బృందం పర్యటిస్తోంది. కేంద్ర జలవనరుల శాఖ పరిధిలోని మట్టి, పదార్థాల పరిశోధనా కేంద్రం (సీఎస్‌ఎంఆర్‌ఎస్) శాస్త్రవేత్తలు హరేంద్ర ప్రకాష్, ఉదయ్ భాను చక్రబోర్తి, సిద్దార్థ్ పీ హెడవూ ప్రాజెక్ట్ ప్రాంతంలో శుక్రవారం పర్యటించారు. పోలవరం ప్రాజెక్టులోని ప్రధాన ఎర్త్ కం రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ నిర్మాణంలో వినియోగించే మట్టి, రాళ్లు, ఇతర పదార్థాలను ఈ బృందం పరిశీలించి పరీక్షిస్తుంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉపయోగించే మట్టి నిల్వల నుంచి మట్టి నమూనాలను సేకరించి, వాటి లక్షణాల నిర్ధారణ కోసం ప్రయోగశాలలో ఈ బృందం పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ బృందం గ్యాప్–1, 2 ప్రాంతాల్లో నాణ్యతా పరీక్షలు కూడా నిర్వహించనుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో వినియోగించే మట్టి, రాళ్లు, కంకర తదితరాలను వారు పరిశీలించి అక్కడికక్కడే పరీక్షించారు. కొంత పరిమాణాన్ని మరిన్ని పరీక్షల కోసం సేకరించారు. ఈ బృందం వెంట జలవనరుల శాఖ ఈఈలు డి.శ్రీనివాస్, బాలకృష్ణ, ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ఎ.గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి, మేనేజర్లు వెంకటేష్, గణపతిరావు ఉన్నారు.


