క్రమశిక్షణతో ముందుకు సాగాలి
నూజివీడు: మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికితీసే విద్యాసంస్థ ట్రిపుల్‌ఐటీలని, విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఏలూరు ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిషోర్ అన్నారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో గూగుల్ డెవలపర్స్ గ్రూప్స్ ఆధ్వర్యంలో శుక్రవారం డెవ్‌ఫెస్ట్‌ను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్పీ జ్యోతీప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రమశిక్షణతో ముందుకు సాగితే పెద్ద పెద్ద లక్ష్యాలను సైతం సమర్ధవంతంగా సాధించవచ్చన్నారు. ప్రభుత్వం ప్రజాధనాన్ని విద్యకోసం ఖర్చు చేస్తోందని, విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధన కోసం పట్టుదలగా ముందుకు సాగాలన్నారు. గూగుల్ డెవలపర్స్ గ్రూప్స్ నిర్వహిస్తున్న డెవ్ ఫెస్ట్ ద్వారా తమ విజ్ఞానాన్ని మరింత పెంచుకోవాలని విద్యార్థులకు ఎస్పీ సూచించారు. ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పరిశ్రమల అవసరాలకనుగుణంగా నైపుణ్యాలను పెంచేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. అనంతరం గూగుల్ డెవలపర్స్ గ్రూపు ప్రతినిధులు విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ రీజనల్ ఉపాధి అధికారి తెంటు అనిల్, సైబర్ సెక్యురిటీ కన్సల్టెంట్ కల్యాణ్ దీక్షిత్, ఎంటర్‌ప్రైజెస్ మైండ్స్ ఏఐ ప్రాక్టీస్ లీడర్ వడ్లమాని మధు, డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్, ఏఓ బీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.


