లస్కర్లకు బకాయి వేతనాలు చెల్లించాలి
పెనుగొండ: జలవనరుల శాఖలో గోదావరి కుడి ఏటిగట్టుపై లస్కర్లకు ఏడు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులకు గురవతున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సిద్ధాంతం సెక్షన్ పరిధిలోని లస్కర్లతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ వరదలు వస్తే నిద్రాహారాలు మాని ఏటిగట్టుపై కాపలా కాసే లస్కర్లకు నెలనెలా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏడాదిలో 365 రోజుల పనిచేయించుకుంటున్నా వారికి 10 నెలలకు మాత్రమే జీతాలు చెల్లించడం దారుణమన్నారు. సిద్ధాంతంలో అయిదుగురు లస్కర్లకుగాను కేవలం నలుగురుతోనే కాలం గడుతున్నారన్నారు. లస్కర్లకు పనిభారం తగ్గించాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకులు కే రత్నంరాజు, లస్కర్లు కడలి చింతారావు, దాసిరెడ్డి పెదకాపు, జాస్తి ప్రభాకర్, యాతం మాధవ రాయుడు పాల్గొన్నారు.


