కోయభారతి.. గిరిపుత్రులకు విద్యాధాత్రి
కోయభాషలో బోధన ఎంతో అవసరం
మాతృభాషలో విద్యాబోధన చేస్తున్నాం
బుట్టాయగూడెం: కేంజాటి (వినండి).. తిరియాటి (మాట్లాడండి).. చదవాటి (చదవండి).. రాసాటి (రాయండి).. అందోరు కలియి కెత్కాటి(అందరూ కలిసి చెప్పండి)... లిపిలేని కోయ భాషలోని పదాలివి. ప్రాథమిక పాఠశాలల్లో చేరే గిరిజన విద్యార్థులకు మాతృ భాషలో తప్ప తెలుగు, ఇతర భాషల్లో ఏ మాత్రం ప్రావీణ్యం ఉండదు. దీనితో వారికి విద్యాబోధన ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కొండ కోనల్లో అంతరించిపోతున్న అరుదైన కోయ భాషకు తెలుగులోనే అక్షర రూపం ఇచ్చి మన్యం ప్రాంతంలోని గ్రామాల్లోని గిరిపుత్రులకు విద్యా బుద్దులు నేర్పిస్తూ వారిని పాఠశాలలకు ఆకర్షితులనే చేసే విధంగా ఐటీడీఏ అధికారులు కృషి చేస్తున్నారు. గిరిజనులు విద్యకు దూరమై సమాజంలో వెనుకబాటుకు గురవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చి వారి జీవితాల్లో విద్య సుగంధాలు నింపేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. గిరిజనుల మాతృభాషను కొనసాగిస్తూనే తెలుగు భాషను అభ్యసించేలా వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చి గిరిపుత్రులను విద్యలో తీర్చిదిద్దేలా కోయభారతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
101 పాఠశాలలో కోయభారతి అమలు
ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన మండలాలైన బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల పరిధిలో 101 గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు, కోయభారతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కేఆర్‌పురం ఐటీడీఏలోని ప్రాజెక్టు మోనిటరింగ్, రిసోర్స్ కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. 101 పాఠశాలల పరిధిలో 321 మంది బాలురు, 429 మంది బాలికలు, కోయభాషలో విద్యను అభ్యసిస్తున్నారు.
విద్యా వలంటీర్లతో మాతృభాష విద్యాబోధన
101 గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు 101 మంది మాతృభాష వలంటీర్లను నియమించి విద్యాబోధన అందిస్తున్నారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో 1, 2 తరగతులు చదివే విద్యార్థులకు మాతృభాష అయిన కోయ భాష ద్వారా పాఠ్యాంశాలను పరిచయం చేసి విద్యాబోధన చేస్తున్నారు. తెలుగు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం, తదితర పాఠ్య పుస్తకాలు రూపొందించి పంపిణీ చేస్తున్నారు. గిరిజన భాషను తెలుగు పదాల్లో రూపొందించిన పుస్తకాలతో మాతృభాష విద్యావలంటీర్లు విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నారు. ఇదిలా ఉండగా బుట్టాయగూడెం మండలంలోని కోయరాజమండ్రి పాఠశాలలో లంబాడీ భాషలో కూడా భాషా వలంటీర్‌లు విద్యాబోధన చేస్తున్నారు.
కోయ భాషలో గిరిపుత్రులకు ప్రాథమిక విద్యా బోధన
101 పాఠశాలల్లో కోయ భారతి అమలు
తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలు కోయ భాషలో రూపకల్పన
మాతృ భాషా విద్యా వలంటీర్లతో విద్యా బోధన
ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజన విద్యార్థులకు మాతృభాషలో తప్ప తెలుగు, ఇతర భాషల్లో ఏ మాత్రం ప్రావీణ్యం ఉండదు. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కోయభాషలో పదాలను తెలుగు అక్షరాలతో రాసేలా బోధిస్తున్నాం. సుమారు 101 పాఠశాలల్లో కోయభారతి కార్యక్రమం ద్వారా మాతృభాష బోధన అందిస్తున్నాం.
– తెల్లం బాబూరావు, ఎంఈఓ, బుట్టాయగూడెం
మాతృభాషలో బోధన చేయడం చాలా సంతోషంగా ఉంది. 1, 2 తరగతులు చదివే పిల్లలకు కోయభాష పదాలతో రూపొందించిన పాఠ్యపుస్తకాలను చదివిస్తూ పిల్లలకు పాఠశాలల పట్ల ఆసక్తి పెరిగేలా చూస్తున్నాం.
– తెల్లం చెల్లమ్మ, మాతృభాష విద్యావలంటీర్, తూర్పురేగులకుంట
కోయభారతి.. గిరిపుత్రులకు విద్యాధాత్రి
కోయభారతి.. గిరిపుత్రులకు విద్యాధాత్రి
కోయభారతి.. గిరిపుత్రులకు విద్యాధాత్రి


