మెట్టలో మామిడి పూతకు మంచు దెబ్బ | - | Sakshi
Sakshi News home page

మెట్టలో మామిడి పూతకు మంచు దెబ్బ

Dec 12 2025 6:00 AM | Updated on Dec 12 2025 6:00 AM

మెట్ట

మెట్టలో మామిడి పూతకు మంచు దెబ్బ

చింతలపూడి: వాతావరణ ప్రతికూల ప్రభావంతో ఏటా జిల్లాలోని మామిడి రైతులకు మామిడి పూత, పిందెలను రక్షించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు పూత సమయంలో పాటించే యాజమాన్యం ఒక ఎత్తు. పూత సమయంలో తోటల్లో పురుగులు, తెగుళ్లు ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితేనే మంచి దిగుబడులు సాధించవచ్చని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. సాధారణంగా 25–30 డిగ్రీల సెంటీ గ్రేడ్‌ ఉష్ణోగ్రత, పొడి వాతావరణం మామిడి తోటలకు మెరుగ్గా ఉంటుంది. ఈ దశలో పూత ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో మామిడి తోటల విస్తీర్ణంలో కృష్ణా జిల్లా తరువాత చింతలపూడి ప్రాంతం ద్వితీయ స్థానంలో నిలుస్తుంది. ఈ ఏడాది మెట్ట ప్రాంతంలో మామిడి తోటలు చాలా చోట్ల పూతలు వస్తున్నాయి. అయితే గత రెండు వారాలుగా విపరీతమైన మంచు కురుస్తుండటంతో పూత పూసిన ప్రాంతంలో మామిడి పంట మంచు దెబ్బకు విలవిల్లాడుతూంది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. సంవత్సరం అంతా సస్యరక్షణ చేపట్టి పంటను కాపాడుకుంటూ వస్తుంటే మంచు కారణంగా పూత మాడిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పూతను కాపాడుకోవాలి

మామిడికి వచ్చిన పూతను కాపాడుకోవడానికి రైతులు ఇప్పటి నుంచీ సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. 5 గ్రాముల పొటాషియం నైట్రేట్‌ లేదా 50 గ్రాముల యూరియా ఒక లీటరు నీటిలో కలిపి చెట్లకు స్ప్రే చేస్తే ఫలితం ఉంటుందని ఉద్యానవన అధికారిణి ఎండి షాఫియ ఫర్‌హీన్‌ తెలిపారు. ఈ సీజన్‌లో మామిడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

తేనె మంచు పురుగు నివారణ ఇలా

ప్రస్తుతం మామిడి పూత వచ్చే సమయంలో తేనె మంచు పురుగు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. లేత పూమొగ్గలు ప్రారంభంలో తేనె మంచు పురుగు ఆసిస్తుంది. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్‌(కాన్ఫిడార్‌) ద్రావణం 10 లీటర్ల నీటికి 3 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. లేదా ధయో మిటాక్జిమ్‌ 10 లీటర్ల నీటికి 3 గ్రాములు కలిపి పిచికారీ చేసినట్లయితే పురుగు ఉధృతి తగ్గుతుంది.

తామర పురుగులు

ఇవి కొత్త చిగురు, పుష్ప గుచ్ఛాలు, పిందెలపైన అసంఖ్యాకంగా చేరి గోకి రసం పీలుస్తాయి. వీటి నివారణకు ఎసిఫేట్‌ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్‌ 2 మిల్లీ లీటర్లు, లేదా 03 మిల్లీ లీటర్ల ఇమిడా క్లోప్రిడ్‌ ఒక లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

బూడిద తెగులు

చల్లని రాత్రులు, పగటి వాతావరణంలో పూత, పిందెలపై తెల్లని పొడిలాంటి బూజు ఏర్పడుతుంది. ఈ శిలీంద్రం ఆశించడం వల్ల పూత, పిందెలు రాలిపోతాయి. వీటి నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా ట్రైడీమార్ఫ్‌ 1 మిల్లీ లీటర్‌ లేదా డైనోకాప్‌ 1 మిల్లీ లీటర్‌, లేదా హెక్సాకోనజోల్‌ 2 మిల్లీ లీటర్లు లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చే యడం వల్ల బూడిద తెగులును నివారించవచ్చు .

మెట్ట ప్రాంతంలో పూతమీద ఉన్న లేత మామిడి తోట

ఎండీ షాఫియ ఫర్‌హీన్‌, ఉద్యానవన శాఖాధికారిణి

మెట్టలో మామిడి పూతకు మంచు దెబ్బ 1
1/2

మెట్టలో మామిడి పూతకు మంచు దెబ్బ

మెట్టలో మామిడి పూతకు మంచు దెబ్బ 2
2/2

మెట్టలో మామిడి పూతకు మంచు దెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement