అధికారి వస్తున్నారని సెంటు చల్లి..
● లాహం ఫుడ్ ఫ్యాక్టరీ పర్యవేక్షణకు వచ్చిన ఒకే ఒక్క అధికారి
● ముందుగానే తెలిసి ఫ్యాక్టరీ ప్రాంతంలో సెంటుకొట్టిన యాజమాన్యం
తణుకు అర్బన్: తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెట్ సంస్థలో అక్రమ గో పశువధపై కొన్నాళ్లుగా నెలకొన్న వివాదం సంగతి తెలిసిందే. దీనిపై ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ‘సాక్షి’ పత్రిక పలుమార్లు ప్రచురించింది కూడా. తణుకు సజ్జాపురానికి చెందిన బీజేపీ నాయకుడు, ఎలక్ట్రీషియన్ రేపాక సూర్య రామారావు కూడా స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనిని పర్యవేక్షణ చేసేందుకు మంగళవారం పొల్యూషన్ శాఖ అధికారి వస్తున్నారని ముందుగానే సమాచారం తెలుసుకున్న ఫ్యాక్టరీ యాజమాన్యం ఫ్యాక్టరీ లోపల, బయట కూడా శుభ్రం చేయించడమే కాకుండా సెంటు చల్లించారని బాధితులు చెబుతున్నారు. రాత్రి, పగలు ఇక్కడ వస్తున్న దుర్వాసనకు ఇళ్లలో కూడా ఉండలేకపోతున్నామని, అధికారులు, ప్రజాప్రతినిధులు రెండురోజులు తమతో వారి ఇళ్లలో కలిసి ఉండాలని, అందుకు అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని వేడుకొంటున్నారు.
పర్యవేక్షణ మొక్కుబడిగా
ముఖ్యమంత్రి కార్యాలయానికి అందిన ఫిర్యాదుతో ఏలూరు నుంచి పొల్యూషన్ శాఖ ఫీల్డ్ అసిస్టెంట్ అధికారి ఎన్.వెంకటరమణ వచ్చి ఫిర్యాదుదారుతోపాటు బాధితుల నుంచి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ వెనుకభాగంలోని పొలాలు, ఫ్యాక్టరీ వెనుక గేటు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితుల సమస్య తెలుసుకున్నానని, ఫ్యాక్టరీ యాజమాన్యానికి 15 రోజుల గడువు ఇచ్చి సమస్యను పరిష్కరించుకునే దిశగా వెళ్లాలని చెప్పనున్నట్లు వివరించారు. కాగా ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదుచేస్తే కేవలం మొక్కుబడిగా ఒకేఒక్క పొల్యూషన్ అధికారిని పంపించారని బాధితులు విమర్శించారు.
రాత్రి సమయాల్లో తీవ్ర దుర్వాసన
ఫిర్యాది రామారావు మాట్లాడుతూ 6 నెలల క్రితం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు పంపానని, నెలరోజుల తరువాత అధికారులు వచ్చి వెళ్లాక సమస్య పరిష్కారం చేసినట్లుగా తనకు సమాచారం వచ్చిందని అన్నారు. సమస్య పరిష్కారం కాకుండా పరిష్కారం అయినట్లుగా మెసేజ్ పంపడంతో మరలా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో పొల్యూషన్ అధికారి వచ్చారని, రాత్రి సమయాల్లో తేతలితోపాటు పైడిపర్రు, తణుకు సజ్జాపురం ప్రాంతాల్లో కూడా దుర్వాసన వస్తుందని చెప్పారు.


