గిరిజన గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు సైతం బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు అందించేలా కృషి చేస్తున్నామని బీఎస్‌ఎన్‌ఎల్ ఆర్‌జీఎం ఎల్. శ్రీను తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన బుట్టాయగూడెంలో విలేకర్లతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల ప్రాంతాల్లో 49 బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ టవర్‌లు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యాయని చెప్పారు. బుట్టాయగూడెం మండలంలోని అటవీప్రాంతంలో ఉన్న తానిగూడెం, వీరన్నపాలెం, రేగులపాడు, రేపల్లె, ఇనుమూరు, తదితర గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మరో 35 టవర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విలీన మండలాలను సైతం కలుపుకుని అన్ని ప్రాంతాల్లో కూడా బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలను మరింత విస్తృతంగా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్‌నెట్ సేవలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీజీఎం నలిని, పీజిఎం, డీఈఓపీ, డీఈ 4జీ ఎస్‌పీ తదితర అధికారులు పాల్గొన్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ ఆర్‌జీఎం శ్రీను


