రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌తో ఉద్యాన వర్సిటీ ఎంఓయూ
తాడేపల్లిగూడెం: ఉద్యాన పంటల్లో సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు గాను రాజమహేంద్రవరంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యానవర్సిటీ మంగళవారం ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఉద్యాన వర్సిటీ వెంకట్రామన్నగూడెంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఉద్యాన వర్సిటీ రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ ఉద్యాన పంటల్లో సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఉద్యాన ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించేందుకు తూర్పుగోదావరి జిల్లా ఈ రంగంలో అభివృద్ధి సాధించడానికి ఎంఓయూ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అరటి ఆకుల ఎకో పైబర్, కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, జీడిపప్పు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు స్థానిక పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. ఉద్యానవర్సిటీ రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు, కె.ధనుంజయరావు, తదితరులు పాల్గొన్నారు.


