నూతన విద్యుత్ లైన్ మంజూరు
కుక్కునూరు: కుక్కునూరు మండలానికి విద్యుత్ కష్టాలు తీర్చే దిశగా ప్రభుత్వం నూతన విద్యుత్ లైన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయిన నాటి నుంచి ఈ మండలాలకు జంగారెడ్డిగూడెం 132 కేవీ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుంది. కాగా విద్యుత్ సరఫరా కుక్కునూరు వరకు చేరాలంటే మైసన్నగూడెం, పి నారాయణపురం, రాచన్నగూడెం, వేలేరుపాడు గ్రామాల్లోని 33 కేవీ సబ్‌స్టేషన్‌లను దాటుకుని రావాల్సి ఉండడంతో చిన్న గాలికే గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి విలీన మండలాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయమై అల్లూరి జిల్లాలోని ఎటపాక 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి గోదావరి మీదుగా నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి కరెంట్ సమస్యను పరిష్కరించాలని ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. దీంతో స్పందించిన ప్రభుత్వం ట్రాన్స్‌కో సర్వేయర్లను మండలానికి పంపి సర్వే చేయించింది. సర్వే రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం అల్లూరి జిల్లాలోని నెల్లిపాక సబ్‌స్టేషన్ నుంచి కొత్త 33 కేవీ లైన్‌ను మంజూరు చేసింది. కాగా ఈ పనులకు త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.


