రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ద్వారకాతిరుమల: క్వారీ రాళ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని గుండుగొలనుకుంట శివారులో సోమవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కామవరపుకోట మండలం వడ్లపల్లికి చెందిన కంచర్ల తనోజ్ కుమార్ (27) ద్వారకాతిరుమల నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి గుండుగొలనుకుంట నుంచి ద్వారకాతిరుమల వైపునకు వెళ్తున్న క్వారీ రాళ్ల లోడు ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తనోజ్ కుమార్ తీవ్ర గాయాలు పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలంలో మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ద్వారకాతిరుమల పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే మృతుడు కామవరపుకోటలోని పామాయిల్ కాటా వద్ద గెలలు లోడింగ్ చేసే పని చేస్తున్నాడు.


