పోలీసులు అన్యాయంగా కొట్టారు
సాక్షి టాస్క్‌ఫోర్స్: తన తప్పు లేకపోయినా పోలీసులు స్టేషన్‌కు పిలిపించి కొట్టారని దళిత యువకుడు సోషల్ మీడియాలో ఆవేదన వెలిబుచ్చాడు. కుక్కునూరు గ్రామం సంజయ్‌నగర్ కాలనీకి చెందిన మాచర్ల సాయి డీజేను రెంట్‌కు ఇస్తాడు. గత శుక్రవారం గొమ్ముగూడెంలో వేడుకకు డీజేను పెట్టాడు. ఆ కార్యక్రమానికి హాజరైన వారు వైఎస్సార్‌సీపీ పాటలు పెట్టి డీజే నృత్యాలు చేశారు. ఈ విషయంపై శనివారం జనసేన మండల అధ్యక్షుడు ములిశెట్టి యుగంధర్ కాల్ చేసి వైఎస్సార్‌సీపీ పాటలు ఎందుకు పెట్టావని ప్రశ్నించినట్టు తెలిపాడు. డీజేను రెంట్‌కు మాత్రమే ఇచ్చానని పాటలకు తనకు ఏ సంబంధం లేదని చెప్పినట్టు బాధితుడు వివరించాడు. ఇలా చేస్తే ఇబ్బంది పడతావని అతను చెప్పాడని, ఫోన్ పెట్టేశాక కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చినట్టు తెలిపాడు. తాను కుక్కునూరు సీఐ అని స్టేషన్‌కు రమ్మని చెప్పారని వీడియోలో పేర్కొన్నారు. స్టేషన్‌కు వెళ్లగా అక్కడ ఉన్న సిబ్బందిలో ఒకరు నీది ఏ కులమని ప్రశ్నించగా.. మాల అని బదులిచ్చానని, ఇలాంటివి మీకు ఎందుకు అని తనపై అరిచారన్నాడు. తరువాత ఎస్సై లోపలికి పిలిచి తనపై దాడి చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తన తప్పు లేకుండా ఎందుకు కొడుతున్నారు సార్ అని అడగగా ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తడం లేదు, నీకు అంత పొగరేంటని సమాధానం ఇచ్చినట్లు చెప్పాడు. దెబ్బలకు చేతిపై బొబ్బలు వచ్చాయని. దళితుడన్న చులకనతో ఏ కారణం లేకుండా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, జనసేన మండల అధ్యక్షుడు ఏం చేస్తాడోనని భయపడుతున్నట్టు చెప్పాడు.


