మొక్కుబడిగానే.. | - | Sakshi
Sakshi News home page

మొక్కుబడిగానే..

Dec 6 2025 9:26 AM | Updated on Dec 6 2025 9:26 AM

మొక్క

మొక్కుబడిగానే..

అరకొర కేటాయింపులు

మొగల్తూరులో టీడీపీ శ్రేణుల నిరసన

సాక్షి, భీమవరం: గతంలో మాదిరి పేరెంట్స్‌కు పాదపూజలు లేవు. ఆటలు, రంగవల్లుల పోటీలు లేవు. మొక్కలు నాటే కార్యక్రమాలు లేవు. అయినా అరకొర కేటాయింపులతో మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీట్‌లు పలుచోట్ల మొక్కుబడి తంతుగానే సాగాయి. పేరెంట్స్‌ హాజరు అంతంతమాత్రమే కావడంతో సమావేశాలు వెలవెలబోయాయి. పిల్లల విద్యాప్రమాణాలు తల్లిదండ్రులకు తెలియజేయడం, వారి విద్యాభివృద్ధి లక్ష్యంగా విద్యాశాఖ శుక్రవారం జిల్లాలో మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీట్‌ (పీటీఎం)లు నిర్వహించింది. గతంలోని పీటీఎంలలో తల్లిదండ్రులకు మహిళలు, పురుషుల విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహణ, గ్రీన్‌ పాస్‌పోర్ట్‌ కింద తల్లి పేరిట ప్రతి విద్యార్థి పెంచే విధంగా ఒక మొక్కను అందజేయడం, తల్లులకు పాదపూజ, వన్‌–ఆన్‌–వన్‌ ఇంటరాక్షన్‌గా విద్యార్థుల హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌, హెల్త్‌ నివేదికను పేరెంట్స్‌కు వివరించడం తదితర కార్యక్రమాలు చేసేవారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్‌ పాఠశాలలోను పీటీఏంలు నిర్వహించేవారు. ఈసారి అందుకు భిన్నంగా కేవలం ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో మాత్రమే మెగా పేటీఎంలు ఏర్పాటుచేశారు. పేరెంట్స్‌కు ఆటల పోటీలు, పాదపూజలు, మొక్కల పంపిణీ లేకుండానే మమ అనిపించారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల నుంచి సరైన స్పందన లేకపోవడం, పేరెంట్స్‌కు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం, మొక్కల పంపిణీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో ఈ విడతలో వాటిని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.

అంతంతమాత్రంగానే హాజరు..

పీటీఎంలకు తల్లిదండ్రులు నూరు శాతం హాజరయ్యేలా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించగా చాలాచోట్ల 50 శాతం మంది కూడా హాజరుకాని పరిస్థితి. ఉపాధ్యా యులు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి వారి పిల్లల విద్యా ప్రమాణాలు తెలియజేయడం, విద్యాసామాగ్రి, బోధనా పరికరాలు, ఇతర సదుపాయాలపై అవగాహన కల్పించాలన్నది లక్ష్యం. పాఠశాలల్లోని సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను పక్కనపెట్టి కూటమి నేతలు ఉపన్యాసాలకే పరిమితమయ్యారు. కార్యక్రమం కోసం టెంట్లు, కుర్చీలు, వంట సామగ్రి, ఇతర షామియానాలకే పాఠశాలలను బట్టి రూ. మూడు వేల నుంచి రూ. పది వేలు వరకు, అతిథులను ఆహ్వానించేందుకు పూలబొకేలు, శాలువాలు తదితర వాటికి తడిసిమోపెడు ఖర్చయిన పరిస్థితి. కొన్నిచోట్ల స్వీటు, పచ్చడి అదనంగా వేయగా, చాలా పాఠశాలల్లో విద్యార్థులకు శుక్రవారం మధ్యాహ్న భోజనం మెనూలో ఉన్న ఆహారాన్ని పేరెంట్స్‌కు వడ్డించారు. ప్రభుత్వం ఇచ్చిన అరకొర కేటాయింపులు చాలక ఉపాధ్యాయుల చేతి డబ్బులు పడినట్టు తెలుస్తోంది.

పండుగ వాతావరణంలో పీటీఎంల నిర్వహించాలని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను సాదరంగా కార్యక్రమానికి ఆహ్వానించాలని, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ఉపా ధ్యాయులు సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేయా లని విద్యాశాఖ సూచించింది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు 1430కు గాను పీటీఎంల నిర్వహణకు మాత్రం కేవలం రూ.29.06 లక్షలు మాత్రమే కేటాయించడం గమనార్హం. ఖర్చుల నిమిత్తం 30 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలకు రూ.900 కేటాయించగా, 31 మంది నుంచి 100లోపు విద్యార్థులున్న పాఠశాలలకు రూ.2,250, 101 మంది నుంచి 250 లోపు విద్యార్థులు ఉంటే రూ.4500, 251 నుంచి 1000లోపు ఉంటే 6750, వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉంటే రూ.9000 చొప్పున ఇచ్చింది. జిల్లాలో 30 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 839 ఉండగా, 100లోపు విద్యార్థులు ఉన్నవి 333 ఉన్నాయి. 250లోపు 153 పాఠశాలలు, వెయ్యిలోపు ఉన్నవి 103, వెయ్యికి పైబడినవి రెండు ఉన్నాయి.

మెగా టీచర్స్‌ పేరెంట్స్‌ కార్యక్రమం మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలోని శ్రీబండి ముత్యాలమ్మ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో జరిగింది. నరసాపురం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నాగిడి రాంబాబు పాఠశాలకు క్రీడాస్థలం కావాలని జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఈయన నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజుకు అత్యంత సన్నిహితుడు. కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో అదే పార్టీ నాయకులు నిరసన తెలపడం చర్చనీయాంశమైంది.

పేరెంట్స్‌కు ఆటల పోటీలు, పాదపూజలు లేవు

మొక్కల పంపిణీ లేదు

మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీట్‌లు వెలవెల

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో మాత్రమే నిర్వహణ

పేరెంట్స్‌ హాజరు అంతంతమాత్రమే

మొక్కుబడిగానే..1
1/1

మొక్కుబడిగానే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement