అత్యాచార ఘటనపై కేసు నమోదు
● నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు
● డీఎస్పీ డీ శ్రావణ్‌కుమార్
ఏలూరు టౌన్: ఏలూరు టూటౌన్ పరిధిలో అర్థరాత్రి వేళ యువతిపై అత్యాచారం సంఘటనపై కేసు నమోదు చేశామని, ఏలూరు నగరంలో ఇష్టారాజ్యంగా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ డీ శ్రావణ్‌కుమార్ చెప్పారు. ఏలూరు పోలీస్ సబ్‌డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఆయన టూటౌన్ సీఐ కే.అశోక్‌కుమార్‌తో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రౌడీషీటర్లు, నేరాలకు పాల్పడే వ్యక్తుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఎక్కడా నిర్లక్ష్యం, అలసత్వానికి తావులేదని ఆయన స్పష్టం చేశారు. ఏలూరు కొత్తపేట ప్రాంతానికి చెందిన సస్పెక్ట్ షీట్, చోరీ కేసుల్లో నిందితుడు పీ.జగదీష్‌బాబు మంగళగిరిలో ఆర్‌టీసీ ప్రైవేటు బస్సుల్లో డ్రైవర్‌గా పనిచేసేవాడు. చోరీ కేసుకు సంబంధించి కోర్టు వాయిదా నిమిత్తం ఏలూరు వచ్చాడు. చోడిదిబ్బ ప్రాంతంలోని ఒక మహిళతో జగదీష్‌కు వివాహేతర సంబంధం ఉండేది. జగదీష్ చోరీ సొత్తును ఆమె విక్రయించేది. మహిళతో ఉన్న పాత పరిచయాల నేపథ్యంలో ఆమె ఇంటికి వెళ్ళాడు. అక్కడ వారిద్దరి మద్య వివాదం ఏర్పడింది. ఆమె ఇంట్లో ఉంటున్న ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యువతిపై ఈ నెల 2 అర్థరాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అఘాయిత్యానికి పాల్పడిన జగదీష్, మరో వ్యక్తి ఎల్.భవానీకుమార్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.


