మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడపాలి
మాజీ మంత్రి కారుమూరి
తణుకు అర్బన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటుపరం చేయకుండా ప్రభుత్వమే నడపాలనే మా నినాదమని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తణుకు రాజీవ్‌గాంధీ చౌక్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన కోటి సంతకాల సేకరణ శిబిరంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం కాకుండా ఉంచాలనే ఉద్దేశ్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తణుకు నియోజకవర్గంలో కోటి సంతకాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు చేసిన సంతకాలను జిల్లా హెడ్‌క్వార్టర్‌కు అక్కడ నుంచి తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయానికి ఆ తరువాత పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్‌కు అందచేసే ప్రక్రియ జరుగుతుందన్నారు. శిబిరాల్లో ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తుండడం అభినందనీయమన్నారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీటు సాధించాలంటే కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పేదవర్గాలు తమ మెరిట్‌ను బట్టి ఉచితంగా వైద్య విద్యకు సీటు లభిస్తుందని స్పష్టం చేశారు. దీంతో పేదవర్గాల్లో పిల్లలను కూడా వైద్యులుగా తీర్చిదిద్దవచ్చన్నారు. ఖరీదైన శస్త్రచికిత్సలు జిల్లాలోని వైద్య కళాశాలలో అందుబాటులో ఉంచాలనేదే జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశ్యమన్నారు. చంద్రబాబు సర్కారు మాత్రం ఏదోరకంగా ప్రైవేటుపరం చేసి లాభపడాలని చూస్తుందని విమర్శించారు. కేవలం రూ. 5వేల కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నిర్వహించలేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో పంచాయితీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, లీగల్ సెల్ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి, అత్తిలి, ఇరగవరం మండల అధ్యక్షులు పైబోయిన సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సబ్బితి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


