విద్యుదాఘాతం నుంచి తల్లిని కాపాడిన కొడుకు
భీమవరం అర్బన్: భీమవరం మండలంలోని జొన్నలగరువులో శుక్రవారం విద్యుత్ షాక్‌కు గురైన తల్లిని కొడుకు కాపాడాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నక్కా దీక్షిత్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. తల్లి నక్కా శ్యామల దుబాయ్ నుంచి వచ్చి రెండు రోజులు అవుతుంది. తల్లి ఇంట్లో మోటార్ వేసి వాకిలి శుభ్రంచేస్తుంది. మోటార్ కట్టేందుకు శ్యామల తడి చేతులతో స్విచ్ ఆపతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరాకు గురై విలవిల్లాడింది. అదే సమయంలో కొడుకు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్‌కి తమ తల్లిని తీసుకువెళ్లేందుకు ఇంటికి రాగా తల్లిని చూసి వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి స్విచ్ ఆఫ్ చేశాడు. కేకలు వేయడంతో స్థానికులు వచ్చి తల్లి శ్యామలకు సపర్యలు చేశారు. ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీక్షిత్‌ను అందరూ అభినందించారు.
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో ఐదువేల మంది కార్మికులకు ఉపాధి కల్పించే రెండు జ్యూట్ మిల్లులు మూతపడటంతో కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు తొర్లపాటి బాబు, కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి పీ కిషోర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూట్‌మిల్లు మూతపడటంతో ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఈఎస్‌ఐ నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. అనేక ఏళ్లుగా ఉపాధి పొందిన కార్మికులు, నేడు రోడ్డున పడ్డారన్నారు. ఏలూరులో ఎలాంటి పరిశ్రమలు లేకపోవడంతో వారికి ఎక్కడా ఉపాధి దొరకడం లేదన్నారు. ప్రభుత్వాలు ఉపాధి కోల్పోయిన జ్యూట్ కార్మికులకు ఉపాధి కల్పించే ప్రత్యామ్నాయం చర్యలు చేపట్టడంలో విఫలం చెందాయని విమర్శించారు.


