సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి

Dec 6 2025 9:26 AM | Updated on Dec 6 2025 9:26 AM

సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి

సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి

సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి అందుబాటులో ఇసుక ఎంప్లాయీస్‌ గ్రీవెన్స్‌ డే నిర్వహించాలి మార్చి 16 నుంచి ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు బాల కార్మికులను రక్షించిన స్పెషల్‌ టీమ్‌

భీమవరం అర్బన్‌: విద్యార్థులు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాన్ని అధిరోహించాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. భీమవరం మండలంలోని గూట్లపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. పిల్లలు స్కూలు నుంచి వచ్చిన తరువాత ఏ విధంగా ఉంటున్నారో తల్లిదండ్రులు గమనించాలన్నారు. సమాజంలో తల్లి పాత్ర ఎంతో ముఖ్యమని తల్లి పిల్లలకు జన్మనిస్తే గురువు జ్ఞానాన్ని బోధిస్తారన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని శ్రద్ధగా చదువుకుని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ, ప్రధానోపాధ్యాయురాలు పి.సత్యవాణి, ఎఎంసీ ఛైర్మన్‌ కె. రాంబాబు, సాంబ, ఓ.మంగాచార్యులు, కొప్పర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచేందుకు ఏడు నియోజకవర్గాల్లో ఏడు ఇసుక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా నిర్వహిస్తున్నామని, వీటిలో 1.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచగా.. ఇంతవరకు 40 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుకను మాత్రమే వినియోగించుకున్నారని చెప్పారు. ఇసుక అక్రమ నిల్వపై జిల్లా గనులు భూగర్భ శాఖ, రెవెన్యూ శాఖల సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి అపరాధ రుసుం విధిస్తోందన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో మూడు అక్రమ ఇసుక నిల్వలను గుర్తించి రూ.2 లక్షల అపరాధ రుసుం విధించామన్నారు. 51 అక్రమ ఇసుక రవాణాదారులకు రూ.23,35,000 అపరాధ రుసుం విధించినట్లు చెప్పారు.

భీమవరం: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మూడో శుక్రవారం ఎంప్లాయీస్‌ గ్రీవెన్స్‌ డే నిర్వహించాలని, ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం సభ్యసంఘాలతో నిర్వహించాలని ఏపీజీఇఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.మోహనరావు, జి.జకరయ్య జిల్లా రెవెన్యూ అధికారిని కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. దీనికి స్పందించిన డీఆర్వో సూత్రపాయంగా అంగీకరించారని జకరయ్య తెలిపారు.

భీమవరం: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్‌స్కూల్‌) ద్వారా ప్రస్తుత విద్యాసంవత్సరంలో నిర్వహించే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16 నుంచి 28 వరకు జరుగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయన్నారు. ఇంటర్‌ థియరీ పరీక్షలు మార్చి 2 నుంచి 13 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు ఏప్రిల్‌ 11 నుంచి 18 వరకు నిర్వహిస్తామని చెప్పారు.

ఏలూరు టౌన్‌: బాల కార్మికులను ఇతర రాష్ట్రాల్లో వెట్టిచాకిరీ చేయించేందుకు చైన్నె తరలిస్తుండగా.. గురువారం రాత్రి ఏలూరు రైల్వే పోలీసులు గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించగా నిందితులు పరారయ్యారు. ఐదుగురు బాలలను శనివారపుపేట ప్రభుత్వ బాలుర వసతిగృహంలో ఉంచారు. ప్రత్యేక బృందాలు రైల్లో తనిఖీ చేస్తుండగా, ఐదుగురు బాల కార్మికులను గుర్తించారు. జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు, బిహార్‌కు చెందిన ఇద్దరు, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఒకరిని దళారులు చైన్నెకు తరలిస్తున్నారు. బాలలను పోలీసులు శుక్రవారం సీడబ్ల్యూసీ చైర్మన్‌ పుచ్చల వెంకటేశ్వరరావు ముందు హాజరుపరిచారు. ఆయన వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి వారి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వస్తే వారికి అప్పగిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement