చివరి సోమవారం పోటెత్తిన భక్తులు
శివనామ స్మరణలో క్షీరారామం
భీమవరం(ప్రకాశం చౌక్): కార్తీక మాసం చివరి సోమవారం భీమవరం పంచారామక్షేత్రం శ్రీ ఉమాసోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానం శివ నామస్మరణతో మార్మోగింది. పంచారామక్షేత్రాల యాత్రికులు, జిల్లా నలమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. సుమారు 20 వేల మంది భక్తులు ప్రత్యేక క్యూలైన్లలో స్వామిని దర్శించుకున్నారు. పార్వతి దేవి, అన్నపూర్ణదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవస్థానంలో స్వామికి అభిషేకాలు, పూజలు, కార్తీక దీపారాధానలు, కార్తీక నోములు నోచుకున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖులు స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం ఆద్వర్యంలో నిర్వహించిన అన్నదానంలో పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదాన ప్రసాదం స్వీకరించారు. దర్శనం, అభిషేకం టికెట్ల ద్వారా రూ.7,59,900 ఆదాయం, లడ్డూ ప్రసాదంతో రూ.46,000 ఆదాయం వచ్చింది. నిత్యాన్నదానం ట్రస్ట్‌లో కానుకల రూపంలో రూ.1,26,660 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు.
స్వామికి ప్రత్యేక పూజలు
స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజాము నుంచే ప్రధాన అర్చకుల రామకృష్ణ ఆధ్వర్యంలో అర్చకులు స్వామికి మహాన్యాసపూర్వక రుధ్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం స్వామికి లక్షపత్రి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి డి.రామకృష్ణంరాజు, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ చింతలపాటి బంగారాజు, ధర్మకర్తలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని భీమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు కార్తీక నోములు నోచుకున్నారు. పట్టణంలో పలు శివాలయాల్లో కార్తీక మాసం నాలుగో సోమవారం స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నిర్వహించారు.
పాలకొల్లులో అన్నదాన సత్రం సమీపంలో క్యూలైన్
పంచారామ క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం క్షీరారామరామలింగేశ్వరస్వామి ఆలయం కార్తీక మాసం చివరి సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వేకువ జాము నుంచి భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం పులకించింది. మహిళలు వేకువజామునే కాలువలో స్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలు వదిలి అనంతరం క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామికి అభిషేకాలు చేయించుకునే భక్తులు మహాన్యాసంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ పంచారామ యాత్రికులతో ఆలయం కిటకిటలాడింది. ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతి, భీమవరం క్షేత్రాలను సందర్శించిన యాత్రికులు క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు అంచనా వేశారు. ఆలయం ఎదురుగా క్షీరారామలింగేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా పాలు పంపిణీ చేశారు. కాపు క్లబ్ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. కార్తీకమాస ఉచిత అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి భక్తులు బారులు తీరారు. కొంతవరకూ టెంట్‌లు వేసినా భక్తుల తాకిడి పెరగడంతో ఎండలో గంటల తరబడి నిలబడ్డారు. రేపాక వారి సత్రం నుంచి బొమ్మన వరకూ అన్నదానానికి భక్తులు క్యూలో నిలబడ్డారు. ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఎస్సై జీజె ప్రసాద్, పోలీసు సిబ్బంది, కళాశాలల విద్యార్థిలు, పలు సేవా సంస్థల సభ్యులు తమ సేవలు అందించారు.
చివరి సోమవారం పోటెత్తిన భక్తులు
చివరి సోమవారం పోటెత్తిన భక్తులు
చివరి సోమవారం పోటెత్తిన భక్తులు


