నూజివీడులో ఆర్చరీ పోటీల నిర్వహణ
నూజివీడు: ఏపీ జూనియర్ అండ్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ చాంపియన్‌షిప్–2025 పోటీలు సోమవారం పట్టణంలోని సార థి ఇంజినీరింగ్ కళాశాలలో సాగాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్, ఉమ్మడి కృష్ణా జిల్లా ఆర్చరీ అసోసియేషన్, చెరుకూరు ఓల్గా ఆర్చరీ అకాడమీ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో భాగంగా కాంపౌండ్ విభాగంలో పోటీలను నిర్వహించారు. 26 జిల్లాల నుంచి 36 మంది పురుషులు, 20 మంది మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళల విభాగంలో రిషి కీర్తన, షణ్ముఖ నాగసాయి, సూర్యహాసిని, కన్షిక, పురుషుల విభాగంలో చరణ్‌శ్రీసాయి, సుహాస్, హర్షవర్ధన్, త్రినాథ్ చౌదరి, వెంకట ప్రద్యుమ్నలు ఎంపికయ్యారు.
వీరవాసరం: నవంబర్ 21 నుంచి 23 వరకు ఆంధ్ర ప్రదేశ్ 69వ స్కూల్ గేమ్స్ అండర్–17 బాలబాలికల సాఫ్ట్‌బాల్, అంతర జిల్లాల టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ అధ్యక్షుడు జుత్తిగ శ్రీనివాస్, కార్యదర్శులు పీఎస్‌ఎన్ మల్లేశ్వరరావు, బాజీంకి శ్రీనివాసరావు తెలిపారు. ఈ పోటీలలో ఉమ్మడి జిల్లాల బాల బాలికల జట్ల నుంచి సుమారు 416 మంది క్రీడాకారులు 52 మంది కోచ్, మేనేజర్లు పాల్గొంటారు.
ఉంగుటూరు : యానాం నుంచి ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లికి మద్యం తీసుకెళ్తున్న ఇద్దరు యువకులను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కారులో యానాం నుంచి 24 బాటిల్స్ మద్యం తీసుకెళ్తుండగా.. చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ అదుపులోకి తీసుకుని కోర్టులో హజరుపరిచారు. కోర్టు యువకులకు రిమాండు విధించింది.
తాడేపల్లిగూడెం రూరల్ : మండలంలోని పడాల గరువుకు చెందిన గుజ్జి జయంతి, కుటుంబ సభ్యులు ఈ నెల 16న విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటికి వచ్చి చూసేసరికి బంగారు, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. వీటి విలువ రూ.1.90 లక్షలు ఉంటుందని, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ హెచ్‌సీ జిలాని తెలిపారు.


