గ్రావెల్ గుట్టలు మాయం
నూజివీడు: పట్టణానికి చెందిన ఒక టీడీపీ చోటా నాయకుడి దెబ్బకు మండలంలోని గ్రావెల్ గుట్టలు మాయమవుతున్నాయి. రాత్రి సమయాల్లో జేసీబీలు పెట్టి అడ్డగోలుగా తవ్వకాలు చేసి టిప్పర్లలో తరలించి అమ్ముకుంటున్నారు. మండలంలోని హనుమంతులగూడెంలోని తేలపోడు తిప్ప గట్టును తవ్వేసి గ్రావెల్‌ను తరలిస్తూ దోచుకుంటున్నారు. టిప్పర్ గ్రావెల్‌ను పట్టణానికి తరలించి రూ.8 వేల నుంచి రూ.9 వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. విస్సన్నపేట, ముసునూరు ప్రాంతాలకు సైతం గ్రావెల్‌ను తరలిస్తున్నారు. అధికారులు ప్రశ్నిస్తే మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నారు. నియోజకవర్గంలో నూజివీడు, ఆగిరిపల్లి మండలాల్లో రాత్రి సమయాల్లో గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకుంటున్న అధికారులే కరువయ్యారు. కొండలను పిండి చేసేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. హనుమంతులగూడెంలోని గట్టును రాత్రి సమయంలో జేసీబీలతో తవ్వి టిప్పర్లలో తరలించడాన్ని గమనించిన గ్రామస్తులు పలువురు పట్టుకుని ఆపారు. అడ్డొస్తే తొక్కించేస్తామంటూ చోటా టీడీపీ కార్యకర్త బెదిరించడం గమనార్హం. దీంతో గ్రామం నుంచి గ్రావెల్‌ను ఎలా తరలిస్తారో చూస్తామంటూ గ్రామస్తులు రాత్రి సమయాల్లో నిఘా పెట్టారు. దీంతో అక్రమార్కులు హనుమంతులగూడెం నుంచి మండలంలోని సిద్ధార్థనగర్ వైపు ఉన్న గుట్టలపైకి దృష్టి మళ్లించారు. అక్కడ గుట్టలను పిండి చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 40 నుంచి 50 టన్నుల బరువుతో తిరుగుతున్న గ్రావెల్ టిప్పర్లతో మట్టిరోడ్లు ధ్వంసమైపోతున్నాయి.


