
కోటి సంతకాల సేకరణకే రచ్చబండ
తణుకు అర్బన్: పేద వర్గాల పిల్లలకు వైద్య విద్య చేరువ చేయాలని, వైద్య కళాశాలల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ప్రధాన ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృఢ సంకల్పంతో ఏర్పాటుచేసిన వైద్య కళాశాలలను చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టేలా ప్రైవేటీకరణ చేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా బుధవారం తణుకు 3వ వార్డులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైద్యకళాశాలలపై ప్రజాభిప్రాయాన్ని కోటి సంతకాల రూపంలో సేకరించి గవర్నర్‌కు అందచేసి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని జగన్‌మోహన్ రెడ్డి కృషిచేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పేదలకు ఖరీదైన వైద్యం ఉచితంగా అందకుండా మోకాలడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఒక్క మెడికల్ కళాశాల కూడా తీసుకురాలేకపోయారని, జగన్ ఐదేళ్లలో రెండేళ్లు కోవిడ్‌తో గడిచిపోయినా మిగిలిన మూడేళ్ల కాలంలో 17 కళాశాలల ఏర్పాటుకు సంకల్పించి 5 కళాశాలలు పూర్తిచేశారన్నారు. ఆరోగ్యానికి జగన్ ఎంతో ప్రాధాన్యతనిచ్చారని, ఆరోగ్యశ్రీని రూ. 25 లక్షలకు పెంచారని, ఉద్దానంలో తాగునీరు సరిగాలేక కిడ్నీలు పాడైపోతుంటే కిడ్నీ సెంటర్‌ను ఏర్పాటుచేశారని గుర్తుచేశారు.
అన్నీ నకిలీ మాయ
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏది చూసినా నకిలీ అని భయమేసే పరిస్థితి ఉందని కారుమూరి ఎద్దేవా చేశారు. విద్య, వైద్యాన్ని భ్రష్టు పట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో పెట్టిన కారణంగా ఆరోగ్యశ్రీ మూతపడిపోయి ప్రజలు ఉచిత వైద్యం కోసం అర్రులు చాచాల్సిన దుస్థితి ఏపీలో నెలకొందని విమర్శించారు. రచ్చబండ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గం నుంచి మొదటి సంతకంగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేశారు. అనంతరం స్థానిక మహిళలచే సంతకాలు పెట్టించారు. పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయితీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, ఆర్గనేజేషన్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, 3వ వార్డు నాయకులు చోడే గోపికృష్ణ, కరుటూరి రంగరావు, నామాల రామాంజనేయులు, శీలం త్రిమూర్తులు, చిట్టూరి రత్తయ్య, బొక్కా నాగరాజు, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్ అన్సారీ, పట్టణ మహిళ్యాక్షురాలు నూకల కనకదుర్గ పాల్గొన్నారు.
మాజీ మంత్రి కారుమూరి