
ప్రశ్నించే గొంతుపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజల గొంతుగా నిలిచి ప్రశ్నిస్తే ప్రభుత్వానికి నచ్చదు.. ప్రతిపక్ష పాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను కూటమి అరాచకాలను వెలుగులోకి తెస్తే వేధింపులకు తెగబడుతున్నారు. కూటమి కొలువుదీరిన తరువాత వేధింపుల్లో జర్నలిస్టులు కూడా బలవుతున్నారు. తరుచూ కేసులు, దాడులు, దౌర్జన్యాలకు గురై హక్కుల కోసం నినదిస్తున్నా స్పందించని పరిస్ధితి. ఈ ఏడాది కాలంలో పశ్చిమగోదావరి జిల్లాలో వరుస మూడు సంఘటనలు జరిగాయి. ఏలూరు సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టడం మొదలుకొని కార్యాలయం వద్ద యూనిట్ కార్యాలయం వద్ద నిరసన పేరుతో కూటమి నేతలు అలజడి సృష్టించారు. తాజాగా నెల్లూరు ఎడిషన్‌లో ప్రచురితమైన వార్తపై వేధింపులకు శ్రీకారం చుట్టారు. విజయవాడ ఆటోనగర్‌లోని సాక్షి కార్యాలయం వద్ద, హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు హడావుడి చేసి నోటీసులు ఇవ్వాలంటూ హంగామా చేస్తున్నారు. గతంలో జిల్లాలో కూటమి నేతల మట్టిమాఫియాపై వరుస కథనాలు, మట్టి మాఫియాలో బలైన బాధితుల వివరాలతో స్పాట్ కథనాలు ప్రచురించడంపై కూటమి నేతలు తారాస్థాయిలో మండిపడ్డారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరగణంతో సాక్షి కార్యాలయం వద్దకు వచ్చి హడావుడి సృష్టించి మూడు గంటల పాటు కార్యాలయం వద్దనే వందలాది మందితో బైఠాయించారు. కొంతమంది అనుచరులు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. జూన్ మొదటివారంలో రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై టీడీపీ శ్రేణులు ప్రత్యక్ష దాడులకు తెగబడ్డారు. అన్ని యూనిట్ కార్యాలయాల వద్ద టీడీపీ శ్రేణులు వీరంగం సృష్టించడం, కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద నేమ్ బోర్డులు తొలగించడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. తాడేపల్లిగూడెం యూనిట్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి సాక్షి పత్రిక ప్రతులను దగ్ధం చేశారు. జూన్ 10న ఏలూరులోని సాక్షి కార్యాలయం వద్ద ఆందోళన ముసుగులో కార్యాలయం కింద భాగంలో ఉండే ఫర్నీచర్‌కు పెట్రోలు పోసి నిప్పంటించారు. ప్రశ్నించినప్పుడల్లా దాడులకు పాల్పడుతూనే ఉన్నారు.
సోషల్ మీడియా పోస్టులపైనా కేసులు
సోషల్ మీడియాపైనా వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి జిల్లాలో ఎవరైనా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలపై పోస్టులు పెడితే కేసుల పేరుతో హోరెత్తించారు. తణుకు మొదలుకొని నూజివీడు వరకు అనేక నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే మొదలైన కేసుల పరంపర కొన్ని చోట్ల నేటికీ కొనసాగుతూనే ఉంది. భీమడోలు, తణుకు, భీమవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, ఉంగుటూరు, కై కలూరు ఇలా అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.
కేసుల పేరుతో కొనసాగుతున్న వేధింపుల పర్వం
ఈ ఏడాది సాక్షి కార్యాలయం వద్ద కూటమి నేతల వరుస ఆందోళనలు
ఆఫీసుకు నిప్పంటించిన వైనం
వ్యతిరేక కథనాలు రాస్తే వేధింపుల పరంపర

ప్రశ్నించే గొంతుపై ఉక్కుపాదం

ప్రశ్నించే గొంతుపై ఉక్కుపాదం