
ఫార్మసీ.. ఏదీ అజమాయిషీ?
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
సాక్షి, భీమవరం: మందుల షాపులపై అధికారుల అజమాయిషీ కొరవడింది. మత్తు మందులతో పాటు కాలం చెల్లిన వాటిని అమ్ముతూ ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న వైనం కొద్దినెలల క్రితం విజిలెన్స్ తనిఖీల్లో వెలుగు చూసింది. తాజాగా మందులపై కేంద్రం జీఎస్టీ తగ్గించినా పలుచోట్ల పాత స్టాకు పేరిట పాత ధరలకే అమ్మకాలు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 1600 వరకు రిటైల్, 400 హోల్‌సేల్ మెడికల్ షాపులు ఉన్నాయి. వీటిద్వారా రోజుకు రూ.10 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. చాలా షాపుల్లో ఫార్మాసిస్టులు లేకుండానే అమ్మకాలు జరిగిపోతున్నాయి. కొందరు బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన వారితో ఒప్పందం చేసుకుని వారి సర్టిఫికెట్లతో షాపులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గుండె, సుగర్, క్యాన్సర్, న్యూరాలజీ తదితర కొన్ని రకాల వ్యాధులకు సంబంధించిన మందులు, ఫ్లూయిడ్స్, ఇంజక్షన్లు నిర్ణీత ఉష్ణోగ్రతల్లో మాత్రమే నిల్వ చేయాలి. కాగా ఎన్ని షాపుల్లో అందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయనేది ప్రశ్నార్ధకమే.
కాలం చెల్లిన, నిషేధిత మందుల విక్రయాలు:
పలుషాపుల్లో మత్తు కలిగించేవి, లైంగిక సామర్ధ్యం పెంచేవి, గర్భస్రావానికి సంబంధించిన నిషేధిత మందులతో పాటు కాలం చెల్లిన మందుల విక్రయాలు అమ్మకాలు చేస్తున్నారు. కొద్దినెలల క్రితం విజిలెన్స్ అధికారులు తాడేపల్లిగూడెం, తణుకు, అత్తిలి తదితర చోట్ల తనిఖీల్లో ఈ తరహా నిషేధిత, కాలం చెల్లిన మందుల అమ్మకాలు చేస్తున్న విషయం వెలుగుచూసింది. వీటిపై పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది గడువు పూర్తయిన మందులకు స్టిక్కర్లు అతికించి అమ్మకాలు చేస్తున్నారు. పలు షాపులకు నిషేధిత మందులు సరఫరాపై అధికారులు వివరాలు సేకరించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. జిల్లాలో ఔషధ నియంత్రణశాఖ అధికారులు ఉన్నా విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగితే తప్ప అక్రమాలు బయటపడకపోవడం గమనార్హం. లైంగిక సామర్‌ాధ్యన్ని పెంచే మందుల వల్ల గుండె, ఊపరితిత్తులపై ప్రభావం పడుతుందని, హార్ట్‌అటాక్ వచ్చే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. గర్భస్రావం మందులు ఒక్కోసారి ప్రాణాల మీదుకు తెస్తాయని, మత్తు కలిగించే మందులతో నిద్రలేమి, నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయంటున్నారు.
జీఎస్టీ తగ్గిన మేరకు మందులు విక్రయించాలి. ప్రజలకు అవగాహన కల్పిస్తూ జిల్లా వ్యాప్తంగా 30 స్టాళ్లు ఏర్పాటుచేశాం. నిబంధనలు అమలయ్యేలా జిల్లా అంతటా తనిఖీలు చేస్తున్నాం. ఎక్కడైనా అధిక ధరలకు మందులు అమ్మకాలు చేస్తున్నా, నిషేధిత మందులు విక్రయిస్తున్నా ఫిర్యాదులు వస్తే వెంటనే తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.
అబిద్ ఆలీషేక్,
జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారి, భీమవరం
మార్కెట్‌లో ఉన్న వస్తువుల ధరలు పెరగ్గానే తమ వద్ద ఉన్న పాత స్టాకుపై పెరిగిన ధరల స్టిక్కర్లు అతికించి ఆ మేరకు అమ్మకాలు చేసి లాభాలు ఆర్జి స్తుంటారు. ధరలు తగ్గినప్పుడు తమ వద్ద ఉన్న ఓల్డ్ స్టాక్ అయిపోయేవరకు వాటిపై ఉన్న ఎమ్మార్పీ ధరలకే విక్రయిస్తుంటారు. ప్రస్తుతం పలుచోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వివిధ రకాల మందులు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, కళ్లజోళ్లు, వ్యాధి నిర్ధారణ కిట్లుపై 12 శాతం ఉన్న జీఎస్టీని ఏడు శాతం మేర, మెడికల్ థర్మోమీటర్లు, మెడికల్ అనాలసిస్ పరికరాలపై 18 శాతం ఉన్న జీఎస్టీని 13 శాతం వరకు తగ్గించగా, 36 రకాల ప్రాణరక్షక, అరుదైన వ్యాధుల మందులపై 12 శాతం నుంచి 5 శాతం వరకు ఉన్న జీఎస్టీలను పూర్తిగా మినహాయింపునిచ్చారు. మందులపై భారీ తగ్గుదల అంటూ ఊరువాడా ప్రభుత్వం ప్రచారం చేస్తుండగా పాత స్టాకులు ఉండిపోయాయంటూ పలుచోట్ల పాత ధరలకే అమ్మకాలు చేస్తున్నారని వినియోగదారులు అంటున్నారు. ఆల్రెడీ ఎమ్మార్పీపై పది నుంచి 15 శాతం వరకు తగ్గించి ఇవ్వడం ద్వారా జీఎస్టీ కంటే ఎక్కువే తగ్గిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు సొంతంగా ఏర్పాటుచేసుకున్న మందుల షాపులతో పాటు కార్పొరేట్ సంస్థలకు చెందిన మెడికల్ షాపుల్లో చాలాచోట్ల ఇంకా ధరలు దిగిరావడం లేదని తెలుస్తోంది.
మెడికల్ షాపులపై కొరవడిన నిఘా
నిబంధనలకు నీళ్లొదులుతున్న వ్యాపారులు
నిషేధిత, గడువు పూర్తయిన మందుల విక్రయాలు
జీఎస్టీ తగ్గినా పాత స్టాకు పేరిట పాత ధరలకే అమ్మకాలు

ఫార్మసీ.. ఏదీ అజమాయిషీ?