
ఎడతెరిపిలేని వర్షాలతో ఆందోళన
● ఈనిక, పాలు పోసుకునే దశలో వర్షం పడితే నష్టమేనంటున్న రైతన్నలు
● మానుపుండు తెగులు ఆశించే అవకాశం
భీమవరం: ఎడతెరిపిలేని వర్షాలతో జిల్లాలోని వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని సార్వా పైరు వివిధ దశలో ఉండగా తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఇప్పటికే ధాన్యం మాసూళ్లు ప్రారంభమయ్యాయి. మిగిలినచోట్ల వరిపైరు పొట్ట, ఈనిక, పాలుపోసుకునే దశలో ఉండగా భారీ వర్షాల కారణంగా గింజ గట్టి పడేదశలో ఉన్న పైరుపై మానుపండు తెగులు ఆశించే ప్రమాదముందని, ఈనిక దశలో ఉన్న పైరుపై వర్షం కారణంగా పుప్పొడి రాలిపోయి గింజలు టప్పలుగా మారి పంట దిగుబడి తగ్గిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో సుమారు 2.18 లక్షల ఎకరాల్లో సార్వా వరి సాగుచేశారు. సీజన్ ప్రారంభంలో సక్రమంగా సాగునీరందరక ఇబ్బందులు పడ్డ రైతులకు పెట్టుబడి సమయంలో ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేయకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సివచ్చింది. ఎరువులు సక్రమంగా లభించక బ్లాక్ మార్కెట్‌లో కొనాల్సి వచ్చింది. ముందుగా నాట్లు వేసిన తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, గణపవరం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే మాసూళ్లు ప్రారంభంకాగా వర్షాలతో ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కొన్నిచోట్ల వరి పొట్ట దశ, ఈనిక, గింజలు పాలుపోసుకునే దశలో ఉన్నాయి. పొట్టదశలో ఉన్న పైరుకు వర్షం మంచిదే అయినప్పటికీ ఈనిక, పాలుపోసుకునే దశలో ఉన్న పైరుకు నష్టమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనిక దశలో వర్షం పడితే పుప్పొడి రాలిపోయి గింజలు తప్పలుగా మారి ధాన్యం దిగుబడి తగ్గిపోతుందంటున్నారు. గింజలు పాలుపోసుకునే దశలో వర్షం కారణంగా మానుపండు తెగులు ఆశిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.