
ఆదాయమున్నా.. కనిపించని వైభవం!
రూ.కోట్లు వృథా
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. నిత్యం వేలాది మంది, శని, ఆదివారాలు, పర్వదినాల్లో అంతకుమించి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారి వార్షిక ఆదాయం రూ.180 కోట్ల పైమాటే. ఒక్క హుండీ ఆదాయమే నెలకు సుమారు రూ.3 కోట్ల వరకు ఉంటోంది. వీటికి దాతల విరాళాలు అదనం. అయితే ఆదాయం ఎంత పెరుగుతున్నా.. స్వామివారి వైభ వం మాత్రం పెరగడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నామమాత్రంగా జరుగుతున్న పలు కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ఇదిలా ఉండగా అధిక శాతం ఆదాయాన్ని భక్తులకు సౌకర్యాల కల్పన పేరుతో అధికారులు వృథా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ట్యాప్ కింద శ్రీచక్రస్నానమా..
బ్రహ్మోత్సవాల్లో శ్రీచక్రస్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చిన్నపాటి ఆలయాల్లో సైతం ఈ వేడుక వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే శ్రీవారి క్షేత్రంలో మాత్రం మొక్కుబడిగా జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. సాధారణంగా శ్రీచక్రస్నానాన్ని కోనేరులో నిర్వహిస్తారు. ఆ సమయంలో భక్తులు ఆ కోనేరులో స్నానం చేసి పునీతులవుతారు. అయితే ద్వారకాతిరుమల క్షేత్రంలో కోనేరు లేకపోవడంతో ఆలయ యాగశాలలో ఉన్న ట్యాప్ కింద స్వామివారికి శ్రీచక్రస్నానాన్ని నిర్వహిస్తున్నారు. దీనిపై భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
రథంలో కనిపించని అమ్మవార్లు : దేవస్థానం ఏడేళ్ల క్రితం తయారు చేయించిన రథాన్ని రథోత్సవాలకు వినియోగిస్తు న్నారు. అయితే రథ నిర్మాణంలో తలెత్తిన లోపాల కారణంగా రథంలో స్వామివారు మినహా, అమ్మవార్లు కనిపించడం లేదు. దీంతో రథయాత్రలో పాల్గొనే భక్తులు అమ్మవార్ల దర్శనం కాక అసంతృప్తి చెందుతున్నారు. రథానికి ముందు భాగంలో అశ్వాలు లేక జీవకళ లేదనే విమర్శలు ఉన్నాయి.
అటకెక్కిన అంచనాలు
గతంలో ఆలయ ప్రాకారం లోపల స్వామివారి ప్రధాన ఆలయాన్ని యథాతఽథంగా ఉంచి, నలువైపులా గ్రానెట్ స్టోన్‌తో అనివేటి మండపాన్ని నిర్మించేందుకు అంచనాలు రూపొందించారు. గతంలో బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి క ల్యాణాన్ని కొండ కింద పాదుకా మండపం వద్ద ఉన్న కల్యాణ మండపంలో నిర్వహించేవారు. అది చాలడం లేదని ఏడేళ్ల క్రితం కల్యాణాన్ని ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోకి మార్చారు. అక్కడే తాత్కాలిక మండపాన్ని నిర్మించి అందులో కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆలయం తూర్పు వైపునే స్టోన్‌తో వాస్తు ప్రకారం మండపాన్ని నిర్మించాలని అంచనాలు రూపొందించారు. అయితే ముందుకు సాగలేదు. దీంతో ఇప్పటికీ తాత్కాలిక మండపంలోనే శ్రీవారి కల్యాణం జరుగుతోంది. ఆలయ ఈశాన్య భాగంలో కోనేరు నిర్మించాలని అంచనాలు రూపొందించారు. అయినా కార్య రూపం దాల్చలేదు.
అశ్వాలు లేకుండా ఉన్న ప్రస్తుత రథం
ట్యాప్ కింద శ్రీచక్రస్నానం నిర్వహిస్తున్న అర్చకులు (ఫైల్)
చినవెంకన్న ఉత్సవాల నిర్వహణపై భక్తుల్లో అసంతృప్తి
శ్రీవారి రథంలో కనిపించని అమ్మవార్లు
ట్యాప్ కిందే శ్రీచక్రస్నానం
కోనేరు, స్వామి కల్యాణ మండపాల నిర్మాణం ఊసే లేని వైనం
కొండపైన టోల్‌గేట్ సమీపంలో రూ.8.50 కోట్లతో నిర్మించిన కల్యాణకట్ట ఆలయానికి దూరం కావడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. రూ.4.10 కోట్లతో నిర్మించిన క్యాంటీన్ భక్తులకు అందుబాటులో లేకపోవడంతో కల్యాణ మండపం, డార్మెటరీ, ఆధ్యాత్మిక గ్రంథాలయంగా మారిపోయింది. అలాగే రూ.2.79 కోట్లతో నిర్మించిన ప్రసాద విక్రయశాల, బుకింగ్ కౌంటర్లు ఆలయానికి దూరం కావడంతో భక్తులు పూర్తిస్థాయిలో వెళ్లడం లేదు. దీంతో కొండపైన అన్నదాన భవనం వద్ద, కొండ కింద సమాచార కేంద్రంలో ప్రసాదాలను విక్రయిస్తున్నారు. ఇటీవల వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్ద నుంచి కొండపైకి కాలినడకన వెళ్లే భక్తుల కోసం రూ.లక్షలు వెచ్చించి మెట్ల మార్గాన్ని నిర్మించారు. ఇప్పుడు వ్యాపారులకు ఇబ్బంది కలుగుతుందని ఆ మెట్ల మార్గాన్ని ప్రారంభించకుండానే మూసేశారు. భవిష్యత్తు అవసరాల మాట ఎలా ఉన్నా.. అధికారుల చర్యలు కారణంగా భక్తులకు ప్రస్తుతం సౌకర్యాలు దూరంగా ఉన్నాయి. ఆలయ అర్చకుల సలహాలు, సూచనలు లేకుండానే అధికారులు ఈ నిర్మాణాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆదాయమున్నా.. కనిపించని వైభవం!