
ప్రైవేటీకరణపై కోటి సంతకాల ఉద్యమం
● గ్రామస్థాయి నుంచి ఉద్యమ కార్యాచరణ
● నవంబర్ 22 వరకు సంతకాల సేకరణ
భీమవరం: కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల ప్రజాఉద్యమం చేపట్టినట్లు పార్టీ నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజు చెప్పారు. శుక్రవారం మండలంలోని రాయలంలో పార్టీ నియోజకవర్గ సమన్వకర్త చినమిల్లి వెంకటరాయుడు క్యాంపు కార్యాలయంలో కోటి సంతకాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టగా.. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి పేదలకు వైద్యవిద్యను దూరం చేయడానికి పూనుకుందన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి 45 రోజులపాటు కోటి సంతకాల ఉద్యమం చేపట్టామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 60 వేల సంతకాల సేకరణ లక్ష్యమన్నారు. సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ నవంబర్ 22 వరకు రచ్చబండ, సంతకాల సేకరణ, 26న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, నవంబర్ 12న జిల్లా కేంద్రంలో ర్యాలీ, 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కార్యాలయానికి సంతకాల సేకరణ ప్రతుల తరలింపు, 24న జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించి గవర్నర్‌కు ప్రతులను అందజేస్తామన్నారు. పార్టీ నాయకులు మేడిది జాన్సన్, కామన నాగేశ్వరరావు, ఏఎస్ రాజు, పేరిచర్ల విజయనర్సింహరాజు, గాదిరాజు రామరాజు, చవాకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తణుకులోని పార్టీ కార్యాలయంలో పరిశీలకుడు మురళీకృష్ణంరాజు, కాళ్ల మండలం పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో ఉండి సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు, పాలకొల్లులోని పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) కోటి సంతకాల సేకరణ పోస్టర్లు ఆవిష్కరించారు.
తాడేపల్లిగూడెంలో పోస్టర్లను ఆవిష్కరిస్తున్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ
భీమవరంలో పోస్టర్లు ఆవిష్కరిస్తున్న పరిశీలకుడు కృష్ణంరాజు, సమన్వయకర్త చినమిల్లి

ప్రైవేటీకరణపై కోటి సంతకాల ఉద్యమం