
పూర్వ పోలీసు అధికారుల సేవలు అభినందనీయం
ఏలూరు టౌన్: రాష్ట్రంలో పూర్వ పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయమనీ సుదీర్ఘకాలం పాటు ప్రజాసేవకే అంకితమై పారదర్శకంగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందారని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. ఏలూరులో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం ఏడో వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గౌరవ అతిథులుగా మాజీ డీజీపీలు మాలకొండయ్య, పి.గౌతంకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాజీ అదనపు ఎస్పీ కె.మాణిక్యాలరావు (80), డిప్యూటీ ఇంజనీర్ చందన విష్ణువర్థన్ (85), మాజీ పోలీస్ కానిస్టేబుల్(86), సయ్యద్ బాజీ (85)ను ఘనంగా సత్కరించారు. అనంతరం అమీనాపేట సురేష్‌చంద్ర బహుగుణ పోలీస్ స్కూల్లోని 12 మంది విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు పీవీఎస్‌కే భగవాన్ రాజు, సంఘం కార్యదర్శి మాజీ సీఐ ఎస్.దాశరధి, ట్రెజరర్ ఎల్.సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ కె.రాజగోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.